యూజీ.. పీజీ పరీక్ష ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలి

–  పిడిఎస్ యు డిమాండ్
నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు)  ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి  కర్క గణేష్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జీ.సురేష్ లు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేటు, డిగ్రీ, పీజీ కళాశాలలకు సంబంధించి పరీక్ష రుసుములను పెంచవద్దన్నారు. ఇప్పటికే విద్యార్థులకు సరిపడా వసతి సౌకర్యం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు.  యూనివర్సిటీ బయోమెట్రిక్ ఫీజులని, కాలేజ్ డెవలప్మెంట్ ఫీజులంటూ, స్పెషల్ ఫీజులంటూ విద్యార్థుల నుండి రుసుములు వసూలు చేయడం ఆపివేయాలన్నారు. ఇప్పటికే కోర్స్ ఫీజులకు సరిపడా ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, ఈ అదనపు ఫీజుల పేరుతో యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కొత్తగా పరీక్ష ఫీజుల పెంపు ఆలోచన చేయడం బాధాకరమన్నారు. పరీక్ష ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి  అందుబాటులో లేకపోవడంతో, నాయకులు ఫోన్లో సంప్రదించగా పరీక్ష ఫీజులను పెంచబోమని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో   జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అశూర్, సహాయ కార్యదర్శి అజయ్, కోశాధికారి నిఖిల్, నాయకులు రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.