– సబిత, వినోద్‌కుమార్‌కు స్పౌజ్ ఫోరం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో స్పౌజ్ బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని స్పౌజ్ ఫోరం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకులు శ్రీదేవసేనను శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు వివేక్, కో కన్వీనర్ నరేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం అవకాశం ఉన్న మేరకు స్పౌజ్ బదిలీలు చేపట్టాలనీ, మిగిలిన వారికి డిప్యూటేషన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. గతేడాది జనవరిలో ప్రభుత్వం కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను మాత్రమే చేపట్టిందని గుర్తు చేశారు. ఇంకా 1500 మంది ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల స్పౌజ్ బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా జరిపించాలని కోరారు. ప్రతిరోజూ కుటుంబాన్ని వదిలిపెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తీవ్ర శారీరక, మానసిక ఆందోళనకు లోనవుతున్నారని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం నాయకులు రాజేశ్వరి, ప్రీతి, సరస్వతి, కృష్ణ, బాలస్వామి, రాజసింహ తదితరులు పాల్గొన్నారు.