మోడీ పాలనలో నిరుద్యోగం రెట్టింపు

– ఏటా 2 కోట్ల ఉద్యోగాల ఊసేలేదు
– డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఏ రహీం, హిమాగరాజ్‌ భట్టాచార్య
– హైదరాబాద్‌లో కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం రెట్టింపయ్యిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జాతీయ అధ్యక్షులు ఏఏ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగరాజ్‌ భట్టాచార్య విమర్శించారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. రెండురోజులపాటు జరగనున్న డీవైఎఫ్‌ఐ కేంద్రకమిటీ సమావేశాలు హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించటం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొ ంటున్న సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. దీంతో కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో దేశంలో రోజురోజుకు నిరుద్యోగం మరింత పెరుగుతున్నదని వివరించారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలే ఇందుకు ప్రధాన కారణమని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఆశ కల్పించిన మోడీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు తదితర ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా కోట్లాదిమంది నిరు ద్యోగులుగా మారారని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యో గాలను ఊడగొట్టే విధంగా బీజేపీ విధానాలున్నాయని విమర్శించారు. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడకుండా మత విద్వేషాలు రెచ్చగొడు తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నదని పేర్కొన్నారు. విద్యారంగంలో మతతత్వ భావాలను చొప్పిస్తూ చరిత్ర పాఠ్యాంశాలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని వివరించారు. జాతీయ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను తొలగిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూలమైన వారి అంశాలను చరిత్ర పాఠ్యాంశాలుగా చేర్చుతున్నదని తెలిపారు. జీవపరిణామ క్రమ సిద్ధాంతమైన డార్విన్‌ సిద్ధాంతాన్ని తీసేసి మూఢవిశ్వాసాలు అంధవిశ్వాసాలతో విద్యారంగాన్ని కలుషితం చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌, వివిధ రాష్ట్రాల నుంచి పలువురు కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.