ఛత్తిస్ గడ్ లో.. నిరుద్యోగం తగ్గింది

– పలు చర్యలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యల్పం
– అంతకుముందు బీజేపీ హయాంలో గరిష్ట స్థాయిలో నిరుద్యోగం
– మాటల్లో కాదు చేతల్లో చూపాం : ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌
రారుపూర్‌ : గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉంటే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 90 శాసనసభ స్థానాలకు రెండు దశలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్‌ ఏడున 20 స్థానాలకు, 17న మిగిలిన 70 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఎన్నికల ప్రచారం ఇంకా లఊపందుకోలేదు. బరిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన పక్షాలు. ఆమ్‌ఆద్మీ పార్టీ రెండోసారి పోటీ పడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న భూపేష్‌ బాఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రమణ్‌ సింగ్‌ నాయకత్వంలోని బీజేపీ సవాలు విసురుతోంది. రమణ్‌ సింగ్‌ 2003 నుంచి 2018 వరకూ వరుసగా మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 25న బీజేపీ ప్రదర్శించిన ఓ కారికేచర్‌ వివాదానికి దారితీసింది. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా బాఘేల్‌ను ఆ కారికేచర్‌లో రావణుడిగా చిత్రీకరించారు. ‘ఈసారి అవినీతి రావణుడు దగ్థమవుతాడు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బాఘేల్‌ ఘాటుగానే స్పందించారు. ‘నాకు సంబంధించినంత వరకూ కమీషన్లు తీసుకోవడం, నిరక్షరాస్యత, పౌష్టికాహార లోపం, రైతుల సమస్యలు, నక్సలిజం వంటివి రావణుని రూపాలు’ అని తిప్పి కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువత ఖాతాల్లో నేరుగా రూ.2,500 జమ చేస్తామని అంటూ ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఆర్‌బీఐ ప్రశంసలు
గత సంవత్సరం డిసెంబర్‌లో సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన సమాచారం ప్రకారం గత సంవత్సరం నవంబరులో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు కేవలం 0.1శాతం మాత్రమే. ఇది దేశంలోనే అత్యల్పం. అదే నెలలో దేశంలో సగటు నిరుద్యోగ రేటు 8.2%గా నమోదైంది. ఛత్తీస్‌ఘర్‌ మాతృ రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ రేటు 6.2శాతంగా ఉంది.
ఈ గణాంకాలనే కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటోంది. పట్టణ-గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమతూకం చేసేందుకు, నూతన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగానే నిరుద్యోగం తక్కువగా ఉందని తెలిపింది.
కోవిడ్‌ సమయంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2020 ఏప్రిల్‌లో దేశంలో నిరుద్యోగ రేటు అత్యధిక స్థాయికి అంటే 23.5శాతానికి కి పెరిగింది. ఆ సమయంలో సైతం ఛత్తీస్‌ఘర్‌లో 3.4శాతం నిరుద్యోగ రేటు మాత్రమే నమోదైందని సీఎంఐఈ తెలిపింది. కోవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో ఛత్తీస్‌గఢ్‌ అగ్రస్థానంలో నిలిచిందని ఆ సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంత దాస్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో పెరిగిన వరి సాగు కారణంగా ఆహార ధాన్యాల నిల్వలు పెరిగాయని, ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించిందని ఆయన చెప్పారు.
నిరుద్యోగులకు అలవెన్సు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి దేశంలోనే అతి తక్కువగా ఛత్తీస్‌ఘర్‌లో 0.8శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. నిరుద్యోగ అలవెన్సు పథకం కింద 12వ తరగతి ఉత్తీర్ణులైన, కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉన్న 18-35 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగులకు నెలకు రెండున్నర వేల రూపాయల అలవెన్సు అందజే స్తోంది. రాష్ట్రంలో నమోదైన 1.29 లక్షల మంది నిరు ద్యోగుల బ్యాంక్‌ ఖాతాల్లో అలవెన్సులు జమ అవుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామ కాల కోసం శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తోంది.
2019 సెప్టెంబర్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ లో నిరుద్యోగం తక్కువగానే ఉంటోంది. అంతకుముందు రమణ్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 22.2%గా ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ఓసారి పరిశీలిస్తే…
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, రుణమాఫీలు, కనీస మద్దతు ధరల అమలు కారణంగా నిరుద్యోగం తగ్గిపోయిందని కాంగ్రెస్‌ తెలిపింది. వ్యవసాయం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో రైతుల సంఖ్య 15 లక్షల నుంచి 26 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించి గిరిజనుల నుంచి 65 రకాల అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసింది. తద్వారా వారికి ఆర్థిక స్వావలంబన చేకూరింది. అంతేకాక తునికాకు సేకరణ ధరను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచింది. మత్స్య పరిశ్రమకు, లక్క ఉత్పత్తికి వ్యవసాయ హోదా కల్పించింది. సంప్రదాయ వృత్తులు నిర్వహించే వారికి, చేనేత కళాకారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరిపింది. గోధన్‌ న్యారు యోజన పథకాన్ని విస్తరించింది. గో మూత్రం కొనుగోలును ప్రారంభించింది. గ్రామీణ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి వాటిలో ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పింది. ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ ఇంజినీర్లను నమోదు చేసి, వారిలో 1,500 మందికి రూ.200 కోట్ల విలువైన పనులు కల్పించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అదే విధంగా రాష్ట్రంలోని అడవుల ద్వారా 14 లక్షల కుటుంబాలకు పనులు కల్పించింది.