ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అవసరం

Democratic forces Unity is needed– ‘వి20’ సమ్మిట్‌ డిక్లరేషన్‌ ఆమోదం
– మూడోరోజూ పోలీసుల ఆంక్షలు
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు సమ్మిళిత, పారదర్శక, సమానమైన భవిష్యత్తు అందించేందుకు ప్రజాస్వామ్య శక్తుల మధ్య సంఘీభావం, ఐక్యత, సహకారం అవసరమని ‘వి20’ సమ్మిట్‌ స్పష్టం చేసింది. పార్లమెంటేరియన్లు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలతో కూడిన వి20 పీపుల్స్‌ సమ్మిట్‌ ‘ప్రజలు.. ప్రకృతికి సమ్మిళిత, పారదర్శక, సమాన భవిష్యత్తు’ పేరుతో ఆదివారం ఈ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌ (హెచ్‌కేఎస్‌)లో మూడు రోజుల పాటు జరగాల్సిన ‘వి20 పీపుల్స్‌ సమ్మిట్‌’ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సదస్సును శనివారం పోలీసులు అడ్డుకుని, నిర్భంధాన్ని విధించారు. నిర్వాహకులు, వక్తలు ప్రతిఘటించడంతో శనివారం కార్యక్రమం కొనసాగింది. ఆదివారం పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతో సెషన్‌లను రద్దు చేసి, వి20 సమ్మిట్‌ డిక్లరేషన్‌పై చర్చించారు. ప్రతినిధులంతా డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి ప్రజా ఉద్యమకారులు, కార్మిక, ప్రజా సంఘాల నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో శ్రామిక వర్గం, దళితులు, ఆదివాసీలు, వికలాంగులు, జాతి, మతపరమైన మైనార్టీ వర్గాలు, రైతులు, మత్స్యకారులు, అటవీ కార్మికులు, వ్యాపారులు, చేతివృత్తులవారు, అసంఘటిత కార్మికులు, విద్యావేత్తలు, పౌర సమాజ సభ్యులు ఉన్నారు.
‘ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు న్యాయమైన, సమ్మిళిత, పారదర్శకమైన, సమానమైన భవిష్యత్తు అందించేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రగతిశీల వ్యక్తుల మధ్య సంఘీభావం, ఐక్యత, బలమైన సహకార అవసరాన్ని వి20 సమ్మిట్‌ నొక్కి చెప్పింది’ అని డిక్లరేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే 18వ జి20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగిన వి20 సమ్మిట్‌ అనేక అంశాలపై వర్క్‌షాపులు నిర్వహించింది.
”జి20 సమావేశాలు సాధారణంగా ధనిక, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రోత్సహించబడిన నయా ఉదారవాద అజెండాను ముందుకు తెస్తుంది. ప్రజల ఆర్థిక, సామాజిక, పర్యావరణ, అసమానత, వ్యవసాయం, ఆహారం, జీవనోపాధి, అప్పుల బాధ, వాతావరణ మార్పు, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య తిరోగమనం వంటి సమస్యలను పరిష్కరించడంలో పదేపదే విఫలమయ్యాయి” అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ప్రజల ప్రాధాన్యతలను తక్షణమే గుర్తించాలని స్పష్టం చేశారు. వి20 సమ్మిట్‌కు హాజరుకాకుండా, ప్రజలు శాంతియుతంగా సమావేశమై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోకుండా అడ్డుకునే పోలీసుల ఏకపక్ష చర్యను వి20 సమ్మిట్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్టు డిక్లరేషన్‌లో పేర్కొంది. ‘పెరుగుతున్న అసమానతలు, కార్మికులు, రైతులు, మత్స్యకారులు, దళితులు, ఆదివాసీల హక్కులను క్రమపద్ధతిలో కాలరాయడం, ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, వాతావరణ సంక్షోభం, విస్తృతమైన పర్యావరణ విధ్వంసం, అంతర్‌-విశ్వాసం, అంతర్‌-మత ఘర్షణలు, మహిళలు, లింగ విభిన్న వ్యక్తులపై హింస పెరగడం, ప్రజాస్వామ్య ప్రాంతాలు తగ్గడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జీ20 సదస్సుకు భారతదేశం ఆతిధ్యమిస్తున్న విషయం తెలిసిందే. దీని నిర్వహణ కోసం న్యూఢిల్లీలో వేలాది మంది పట్టణ పేదలు, అట్టడుగు వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్న అంశాలను ప్రస్తావించారు. జీ20 సదస్సు పేరుతో పేదలను బలవంతంగా ఇండ్ల నుంచి వెళ్లగొట్టారనీ, పరిహారం, సరైన పునరావాసం లేకుండా జీవనోపాధిపై దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. వారికి పునరావాసం, తగిన పరిహారం ఇవ్వాలి’ అని వీ20 సదస్సు డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం దేశంలోని ఆర్థిక, ప్రకృతి సంక్షోభ సమయంలో జి20 భారతదేశ అధ్యక్ష పదవిని ప్రచారం చేయడానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో ఖర్చు చేయడాన్ని వి20 సమ్మిట్‌ తీవ్రంగా తప్పుపట్టింది. వీ20 డిక్లరేషన్‌లో మొత్తం 20 అంశాలను ప్రస్తావించారు.