– కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1445 మంది కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మంగళవారం హన్మకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ పరిపాలన భవనం నుంచి ఎస్‌డీఎల్‌సీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోధ్ పాల్గొని మాట్లాడారు. 145 రోజుల నుంచి అనేక విధాలుగా సదస్సులు, రౌండ్ టేబుల్, కాన్ఫరెన్స్, నిరసనలు, రిలే నిరాహార దీక్షలు చేయడంతో పాటు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులను, విద్యాశాఖ మంత్రి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మెన్‌ను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంట్రాక్టు అధ్యాపకులందరూ విధుల్ని బహిష్కరించి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినట్టు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులనూ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ మధుకర్ రావు, జరుపుల చందులాల్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రఘు వర్ధన్ రెడ్డి ఆర్‌డీ ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు,కల్పన, శ్రీలత, స్వప్న, మంజుల, రాజశ్రీ, రాజేష్ రెడ్డి, రమేష్, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు