నిర్దయావ్యాపనం

Unmercifulఆమె
బాలిక కాదు
భారత మాత!
రక్షించండి! రక్షించండి

పాపం!
ఆమ్మాయి నెత్తుటిసెలైనై స్రవిస్తూ
మీ వాకిలిలో దు:ఖమవుతోంది
మీ తలుపు శబ్దమవుతోంది
మీ గోడ పట్టుకు వేలాడ్తోంది

దారితప్పించ బడ్డ
ఆ భారతమాత
నీ బిడ్డనో నా బిడ్డనో
పాపమంటోళ్ళే లేరే!

తల్లులారా! తండ్రులారా!
ఆ బడిపిల్లా
బిచ్చ మెత్తుకోడానికి రాలే!

కంటి నిండా
అక్షరాలు బుక్కుదామని బయలుదేరింది
నోటి నిండా
పదాలు పుక్కిట పడ్దామని బయలుదేరింది

బడికీ బాటసారితనానికీ
మధ్య
మానభక్షకులుంటారని తెలియనితనం!

చిన్నపిల్ల!
అభం శుభం తెలియని భారతమాత!
ఎవడో చెదరగొట్టిన శరీర వస్త్రాల్ని చూసి
అలా బెదురగొట్టకండి
గెదుమకండి
అయ్యో!
ఎక్కడి కెల్తుంది ?
ఎందాక పరుగెడుతుంది?

మనుషులం కదా!
ఇంకెవరు గుండెల్లో దాచుకుంటారు?

ఆ ఒంటి మీద చేయి వేసి
భరోసా ఇవ్వకుంటెమాయె
చేరదీసి
నాలుగు మాటలు చెప్పి
కుదుట పరచకుంటె మాయె
ఇన్ని నీళ్ళిచ్చో
ఇంత బువ్వబెట్టో
ఆ చిన్నారి పొట్టమీది నెత్తుటిరేఖల్ని
తడుమకుంటె మాయె

ఎందుకు తర్ముతున్నారు?
అమ్మా నాన్నే కనబడితే
మిమ్మల్ని అమ్మా! అయ్యా! అంటుందా?

చీకిపోయి చీలికలైపోయిన
ఇంటి మీద ఎగుర్తున్న జాతీయజండాలా
చీలికలు పేలికలైన ఒంటి మీది గుడ్డల
భారతమాత!?
మిమ్మల్నేమడుగుతోంది?
ఆమె ఒళ్ళుకప్పుకోడానికే !
ఆ రొండు కాళ్ళ మధ్య నెత్తుటి గంగను ఆపడానికే!

రొండు గుడ్డలియ్యలేని కరత్వమా?
మనిషితనానికి ఎంత కరువొచ్చింది?
ఇంత దయలేనితనమా!
ఇంత అమానవీయమా!

ఓహో!
స్త్రీలంటే దేవతలని కొలిచే
రాముని వారసత్వపాలనలో కదా!
మనమున్నది.
– వడ్డెబోయిన శ్రీనివాస్‌