ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నేడు అసెంబ్లీ ఎన్నికల తిరునాళ్లను చూస్తున్నాం. కొనుక్కోగలిగే నేతలు రాజకీయంగా హవా నడిపిస్తున్నారు. ఎన్నికల్లో చేసే ఖర్చు ఉహకు సైతం అందడంలేదు. అ వ్యయం అసాధారణమని రాజకీయ, ఆర్థిక విశ్లేషకుల భావన. తెలంగాణలో ఈ నెల 30 పోలింగ్ జరగనుంది. 119 నియోజక వర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల గోదాలోకి దూకారు. గతం కంటే ఈ సారి 469 మంది అధికంగా పోటీపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం లౌడ్‌స్పీకర్లు, మైకుల శబ్దాలతో హోరెత్తుతోంది. ఆయా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లో నేతలు సహా దాదాపు 298 మంది స్టార్ క్యాంపెయినర్లు తమ ప్రసంగాలతో జనాన్ని ఊదర గొడు తున్నారు. ఏ గ్రామం చూసినా, ఏ జిల్లాను పరిశీలించినా, ఏ టీవీ ఛానెల్ పెట్టినా, ఏ పత్రిక చదివినా అంతా ఎన్నికల గోలనే. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయసమ్మేళనాల జోరే ఎక్కువ. మందు, విందు కొసరు నాణానికి ఒకవైపు. మరోవైపంతా గలీజు రాజ కీయం. ప్రజాసమస్యలు మరుగునపడేలా నేతలు వ్యక్తి గత దూషణల దశదాటి తిట్ల పురాణాల్లోకి జారిపోతున్నారు. ఆ పేర మహిళలను సైతం కించపరుస్తున్నారు. ఓటును మార్కెట్లో సరుకుగా మార్చేసి, కొనుగోలు చేసే దుష్ట సంస్కృతికి పాదువేశారు.
అన్నీ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించినా, వాటిపై పెద్దగా పట్టింపు లేదు. సమాజంలోని ఆయా సామాజిక తరగతుల కష్టాలు, కడగండ్లను ఎట్టికి వదిలేశారు. రైతులు, వ్యవసాయకూలీలు, వృత్తి దారులు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, పోడు రైతుల సమ స్యలపై వామపక్షాలు మినహా ఏ పార్టీ కూడానూ చడీచప్పుడు చేయదు. నాయకులు నోళ్లు మెదపరు. యువత ఉద్యోగాల వ్యధను కదపరు. మార్క్సిస్టు మహానేత పుచ్చలపల్లి సుందరయ్య వారసులుగా పంతొమ్మిది నియోజక వర్గాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు ప్రజల లోగిళ్లలో ప్రత్యక్షమవుతున్నారు. పోడు భూముల పోరాటంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లినవారు, జనం కోసం పాదయాత్ర చేసినవారు, తమ ఆస్తులను త్యాగం చేసినవారు, పేదలకే జీవితాలను అంకితం చేసిన నాయకులు బరిలోకి దిగి జనం పాట అందుకున్నారు. అణగారిన వర్గాల సమస్య లను ఎజెండా చేస్తున్నారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో అడుగిడితే, ఎలా ఉంటుందో విడమర్చి చెబుతున్నారు. ఆదరించాలని కోరుతు న్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరినొకరు పరుషంగా తిట్టుకోవడమే తప్పితే జనం గోడేది? ఈ పార్టీలవీ ఒకే తరహా విధా నాలే. పేదలపై ప్రేమలేదు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ పేదరికం తగ్గడం లేదు. 2021 నిటిఅయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 13.74 జనాభా పేదరికంలో మగ్గుతు న్నది. కనీసావసరమైన తాగునీరు ఇరవై నాలుగు శాతం మందికి అందుబాటులో లేదు. పేదరికం గ్రామాల్లో 7.5 శాతం కాగా, పట్టణాల్లో 5.88 శాతం ఉందని ఆ నివేదిక తేటతెల్లం చేసింది. పార్టీలు మా రడం, స్వప్రయోజనాలపై ఉన్న మక్కువ, ప్రజల మంచి, చెడుల పరిష్కారంపై లేక పోవడం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో కప్పదాట్లు బాగా పెరిగాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఇవి సాగుతుండటం అవి ఒకే తానులోని ముక్కలేనని చెప్పడానికి ఇంకేం కావాలి సాక్ష్యం?
ఎన్నికల సంఘం, పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్మే ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. ఈ నెల ఇరవై నాటికి పట్టుబడిన రూ.1760 కోట్ల్లలో రూ.659.2 కోట్లు తెలంగాణదే. నగదులోనూ అరవై శాతం మనదే. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ధన ప్రభావం విపరీతంగా ఉన్నట్టే. ఐదు రాష్ట్రాల్లో 2018లో పట్టుబడిన సొమ్ము రూ.239.15 కోట్లతో పొలిస్తే ఈ సారి ఇప్పటికే దొరికిన సొత్తు విలువ 636 శాతం అధికం. దిగజారిన రాజకీయ విలువలకు దర్పణమిది. నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, విలువైన లోహాలు దొరకడం దురదృష్టకరం. సందట్లో సడేమియాలా కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్షాలను వేధిస్తున్నది. ఎన్నికలనూ అవకాశంగా తీసుకుని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై ఐటీ దాడులతో జనంలోకి వెళ్ల కుండా అడ్డుకుంటున్నది. ప్రధానంగా కాంగ్రెస్ అభ్య ర్థులపై విపరీతంగా చేస్తున్నది. రణతంత్రపు ఎత్తులు వేస్తున్నది. ప్రత్యర్థులను దెబ్బతీసేలా వ్యూహ, ప్రతి వ్యూహాలకు పూనుకున్నది. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టు కుని అధికారికంగానే పోల్ మేనేజ్‌మెంటుకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి అక్రమంగా నిధుల వరద పారుతున్నది. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో పట్టుబడు తున్న సొమ్మే దీనికి నిదర్శనం. ఓటర్లు, ప్రజలు మేలుకుని కంఠకుల పీచమణచకపోతే, ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదం. ప్రశ్నార్థకం. ఓటు ప్రతి ఐదేండ్లకో సారి వచ్చే పండుగకాదు. తమ బతుకుదెరువుని చక్క బెట్టుకునే ఆయుధమని ప్రజలు గుర్తెరగాలి.