– కిరాక్ హైదరాబాద్ యజమాని గౌతమ్ రెడ్డి
హైదరాబాద్: భారత్‌లో స్పోర్ట్స్ లీగ్‌ల హవా నడుస్తోంది. డిజిటల్, సోషల్ మీడియా దన్నుతో స్పోర్ట్స్ లీగ్‌లకు గొప్ప ఆదరణ లభిస్తుంది. ఇప్పుడిప్పుడే తొలి సీజన్ ముగించుకున్న ‘ప్రొ పంజా లీగ్’ సైతం విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి కిరాక్ హైదరాబాద్ ప్రొ పంజా లీగ్‌లో పోటీపడింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన కిరాక్ హైదరాబాద్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ, టై అనంతరం టైబ్రేకర్‌లో విజేతను తేల్చగా.. మన జట్టు రన్నరప్‌తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్మ్ రెజ్లింగ్‌కు అపూర్వ ఆదరణ లభించిందని కిరాక్ హైదరాబాద్ యజమాని నెదురుమల్లి గౌతమ్ రెడ్డి అన్నారు. తొలి సీజన్‌లో కిరాక్ హైదరాబాద్ ప్రదర్శన, ఆర్మ్ రెజ్లింగ్ చూపించగల ప్రభావంపై ఆయన నవ తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్‌కు గొప్ప స్పందన లభించింది. ప్రత్యేకించి సోషల్ మీడియా సరిహద్దులు చెరిపేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్మ్ రెజ్లింగ్‌కు ఊపు తీసుకొచ్చేందుకు ప్రొ పంజా లీగ్‌ను ఓ అవకాశంగా తీసుకున్నాం. ఆర్మ్ రెజ్లింగ్, కిరాక్ హైదరాబాద్‌కు లభించిన అపూర్వ ఆదరణకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి స్పోర్ట్స్‌కు ఇంత చక్కటి స్పందన లభించటం లీగ్ సాధించిన అతిపెద్ద విజయం. ఆర్మ్ రెజ్లింగ్ ఎంతో పురాతనమైన స్పోర్ట్. ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో క్షేత్రస్థాయిలో ఆర్మ్ రెజ్లింగ్‌ను విపరీతంగా అభిమానిస్తారు. ప్రొ పంజా లీగ్ వంటి వేదికపై జాతీయ, అంతర్జాతీయ ఆర్మ్ రెజ్లర్లతో పోటీపడుతూ హైదరాబాద్ ఆర్మ్ రెజ్ల్లర్లను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుపటం గర్వంగా ఉంది. ఆర్మ్ రెజ్లింగ్‌కు దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ అభిమానాలు అమోఘం. కిరాక్ హైదరాబాద్ జట్టులో మంచి అనుభవం గడించిన, అవార్డు గ్రహీతలైన ఆర్మ్ రెజ్లర్లు ఉన్నారు. జట్టులోని భిన్నత్వమే కిరాక్ హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలిపింది. జట్టులోని ప్రతి ఆటగాడు.. సహచర ఆటగాడి నుంచి నేర్చుకోవాలనే తపన చూపిం చారు. ఆ వాతావరణమే అభిమానుల హృద యాలను గెల్చుకునేందుకు మార్గం వేసింది. లీగ్ న్యూఢిల్లీలో జరిగినా.. సోషల్ మీడియా వారధిగా తెలుగు అభిమానులకు చేరువయ్యాం. ఆర్మ్ రెజ్లింగ్ యువత, కుటుంబాలకు బాగా చేరువైంది. వచ్చే సీజన్ కోసం కిరాక్ హైదరా బాద్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన ఆర్మ్ రెజ్లర్లను గుర్తించి.. లీగ్‌లో పోటీపడే అవకాశం కల్పించాలని భావిస్తున్నామని’ గౌతమ్ రెడ్డి తెలిపారు.