న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అవినీతికి పాల్పడ్డాడని, అధికార దుర్వినియోగం చేశాడని ఆదేశ కాంగ్రెస్‌లో భాగమైన ప్రతినిధుల సభ పేర్కొంది. ఇందుకు సంబంధించిన అభిశంసనపై విచారణ చేపట్టాలని రిపబ్లికన్లు చేస్తున్న డిమాండ్‌ను ప్రతినిధుల సభలో జరిగిన ఓటు అధికారికం చేసినట్టయింది. ఈ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 221 ఓట్లు, వ్యతిరేకంగా 212 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ పూర్తిగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల బలాబలాలను అనుసరించి జరిగింది. సభలో హాజరైన ప్రతి రిపబ్లికన్ ప్రతినిధి అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేయగా, ప్రతి డెమోక్రాట్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకే ఒక డెమోక్రాటిక్ ప్రతినిధి గైర్హాజర్ అయ్యారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు చేసిన తీర్మానంతో సమయం వృథా అవటంతప్ప ఉపయోగం ఏమీ ఉండదని, ఇదో నిరాధార రాజకీయ స్టంట్ అని బైడెన్ ప్రకటించారు. 2020లో జరిగిన మధ్యంతర ఎన్నికల తరువాత ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజారిటీ రావటంతో బైడెన్ దురాగతాలపైన విచారణ జరపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విచారణ ‘హౌస్ ఓవర్ సైట్ కమిటీ’, ‘హౌస్ జ్యుడీషియరీ కమిటీ’ల నేతృత్వంలో జరుగుతుంది. ఈ కమిటీలు బైడెన్ కుటుంబం చుట్టూవున్న ‘అవినీతి సంస్కృతి’ని వెలికితీశాయి గనుక అభిశంసన విచారణ ఆవశ్యకత ఉందని గత సెప్టెంబర్‌లో మాజీ హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్థీ ప్రకటించాడు. బైడెన్ కుమారుడైన హంటర్ ల్యాప్ టాప్ నుంచి వెలికితీసిన ఫైళ్ళలో చైనా, కజకిస్తాన్, రుమేనియా, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు చెందిన షెల్ కంపెనీల నుంచి బైడెన్ ఉపాధ్యక్షుడిగావున్న కాలంలో ఆయన కుటుంబానికి 24మిల్లియన్ డాలర్ల చెల్లింపులు జరిగినట్టు సాక్ష్యాలు దొరికాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్ బైడెన్‌కు చెందిన 150లావాదేవీలను అనుమానాస్పదమైనవిగా మార్క్ చేసిందని ఈ కమిటీలు గమనించినట్టు తెలిపాయి.
బైడెన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో ఆయన కుమారుడి పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. అనేకమంది విదేశీయులతో వ్యాపార లావాదేవీలను జరిపినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఉదాహరణకు అమెరికా విధానాన్ని ప్రభావితం చేయటం కోసం హంటర్‌కు ఉక్రెయిన్ ఎనర్జీ కంపెనీ బ్యూరిస్మా బోర్డులో స్థానం కల్పించినట్టు ఆయన మాజీ వ్యాపార భాగస్వామి డెవాన్ ఆర్చర్ ఓవర్ సైట్ కమిటీకి చెప్పారు.