నూతన ఆవిష్కరణలకు ఉపయోగం

– టీఎస్‌కాస్ట్‌తో బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం
– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో సంతకం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌ కాస్ట్‌తో బాసర ఆర్జీయూకేటీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్జీయూకేటీ వీసీ వి వెంకటరమణ సమక్షంలో టీఎస్‌ కాస్ట్‌ మెంబర్‌ సెక్రెటరీ ఎం నగేష్‌, ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ వి సతీష్‌కుమార్‌ ఆ ఒప్పంద పత్రంపై గురువారం హైదరాబాద్‌లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల టీయస్‌ కాస్ట్‌ – బాసర ఆర్జీయూకేటి రెండూ ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలైన పరిశోధన, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రయోగశాల నుంచి సాంకేతికతలను జోడిస్తూ ఉమ్మడి రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లతోపాటు సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు చేపట్టేందుకు టీఎస్‌ కాస్ట్‌ ద్వారా ఆర్జీయూకేటీ యూజీ, పీజీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు దోహదపడుతుందని అశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవడం, విద్యార్థుల్లో వాటి పట్ల మరింత ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో బాసర ఆర్జీయూకేటిలో మౌలిక వసతులు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు అభ్యసిస్తున్నారని అన్నారు. ఆర్జీయూకేటి సహకారంతో నిర్మల్‌ జిల్లాను ఐటీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్జీయూకేటీ వీసీ వి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంకుర సంస్థల ఏర్పాటుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే నిర్మల్‌ జిల్లాలో ఆర్జీయూకేటికి అనుబంధంగా నిర్మల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఎన్‌ఐహెచ్‌)ను ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్‌తో పాటు నిర్మల్‌ జిల్లాలో కూడా డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.