కేసీఆర్‌ను కలిసిన వనమా

Vanama met KCR– సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో
– నేడు కొత్తగూడెంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుధవారం ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. గత నెల 25న ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంటూ వనమాను హైకోర్టు అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు నిచ్చింది. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై స్టే కోరుతూ తొలుత హైకోర్టును వనమా ఆశ్రయించగా గత నెల 27న నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై ఈనెల 7న స్టే విధించింది. 15రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటివరకు హైకోర్టు తీర్పు అమలు కుదరదని క్లారిటీ ఇచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ తరుణంలోనే సీఎంను వనమా కలువడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొత్తగూడెం టికెట్‌ మరొకరికి క్లారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్న సమయంలోనే కేసీఆర్‌ను కలువడం హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం వనమా నేతృత్వంలో కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న వనమా సుప్రీంకోర్టు తీర్పుతో కేడర్‌లో జోష్‌ నింపేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో వనమాతో పాటు సోదరుడు రామకష్ణ కూడా ఉన్నారు.