కాచిగూడ – యశ్వంత్‌పూర్‌కు వందేభారత్‌

Vande Bharat to Kachiguda - Yeswantpur– తొమ్మిది రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (20703) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సహ తొమ్మిది రైళ్లను.. ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు రెగ్యులర్‌ సర్వీసులు ఈనెల 25న యశ్వంత్‌పూర్‌(20704) నుంచి, 26న కాచిగూడ నుంచి ప్రారంభమవుతాయి. బుధవారం మినహా వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది.కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ (20703) వందేభారత్‌ రైలు ఉదయం 05:30 గంటలకు కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) జంక్షన్‌ చేరుకుంటుంది. మధ్యలో మహబూబ్‌నగర్‌ (6.49), కర్నూలు సిటీ (8.24), అనంతపురం (10.44), ధర్మవరం జంక్షన్‌ (11.14) స్టేషన్లలో ఆగుతుంది. 610 కిలోమీటర్ల దూరానికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. సూపర్‌పాస్ట్‌ సర్వీసులతో పోల్చుకుంటే దాదాపు 3గంటల ప్రయాణ సమయం ఆదాఅవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1600గా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ ధర రూ.2915గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20704) మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరుతుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. ధర్మవరం జంక్షన్‌ (4.59), అనంతపురం (5.29), కర్నూలు సిటీ (7.50) మహబూబ్‌నగర్‌ (9.34) స్టేషన్లలో నిమిషం చొప్పున ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1540 గానూ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.2865గానూ రైల్వే శాఖ నిర్ణయించింది.