వర్సిటీ కాంట్రాక్టు

– అధ్యాపకులను క్రమబద్ధీకరించండి
– సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. అటు పరిపాలనలో, ఇటు విద్యారంగంతోపాటు పరిశోధనారంగంలో కూడా వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లో సర్క్యులర్‌ను జారీచేసి, సర్వీసు రెగ్యులరైజ్‌ చేసేందుకు ధ్రువపత్రాలను పరిశీలించిందని గుర్తు చేశారు. కానీ, ఈ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు. క్రమబద్ధీకరణకు సంబంధించి వారికి అన్ని అర్హతలున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వారు వేతనాలు పొందుతున్నారని పేర్కొన్నారు. డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులను ఏ విధంగా రెగ్యులరైజ్‌ చేశారో, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును కూడా క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.