నవతెలంగాణ – వేములవాడ రూరల్
చుట్టుపక్కల ప్రజలు వరద ఉధృతిని దాటేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి ఎవరు తెచ్చుకోవద్దు అని గస్తి నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలిఅని ఆదివారం వేములవాడ రూరల్ మండల ప్రజలకు ఎస్సై మారుతి సూచించారు.గత రెండు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్క వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా మల్లారం ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు రహదారిపై నుంచి వరద పోటెత్తడంతో వేములవాడ రూరల్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రాకపోకలను నిలిపివేసి భద్రత చర్యలను చేపట్టారు. నక్క వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో తాత్కాలికంగా వేసిన రోడ్డు నిర్మాణం వరదలో కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వరద ఉధృతిని దాటకుండా పోలీస్ సిబ్బందితో గస్తీని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటేందుకు ఎవరు కూడా ప్రజలు ప్రయత్నించవద్దని ఎస్సై మారుతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గస్తి నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.