– సర్కార్ ఆర్డర్ లేకుండానే పనులు
– వేతనం ఊసేలేదు
– పట్టించుకోని రెవెన్యూశాఖ
– మంత్రులు, కలెక్టర్లను కలిసినా ఫలితం శూన్యం
– ఇదీ కంప్యూటర్ ఆపరేటర్ల దుస్థితి
– మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి :బాధితులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగిగానో..కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలోనో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పనిచేయాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూశాఖలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఆ శాఖలో ఏలాంటి ఆర్డర్ లేకుండానే కంప్యూటర్ ఆపరేటర్లతో పనులు చేయిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో భూ రికార్డులను ఆన్‌లైన్ చేశారు. అప్పటి నుంచి ఈ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖ చేస్తున్న అన్ని పనులూ వీరి ద్వారానే కొనసాగున్నాయి. కానీ వీరికి వేతనం లేదు. ఉద్యోగ భద్రత లేదు. ఫలితంగా ఆయా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమను ఆదుకోవాలని కోరుతూ మొరపెట్టుకో ని మంత్రిలేడు…కలవని కలెక్టర్ లేరు. అయినా ఎక్కడేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. అయితే బుధవారం సచివాలయానికి వచ్చిన వారు తమ గోడును వెళ్లబోశారు. తమను కనీసం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానైనా గుర్తించాలని వేడుకుంటున్నారు.
2011 నుంచి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యువల్‌గా భూ రికార్డులను ఆన్‌లైన్ చేశారు. అప్పటి నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 33జిల్లాలకు కలెక్టరేట్‌లు ఉన్నాయి. ఒక్కో కలెక్టరేట్‌కు ఐదుగురి చొప్పున 33జిల్లాలకు 165 మందిని ఆ కలెక్టర్లకు కేటాయించారు. 74 ఆర్‌డీఓ కార్యాలయాలకు ఒక్కో ఆర్‌డీఏకు ఇద్దరి చొప్పున 148 మందిని కేటాయించారు. 594 మండలాలకు ఒక్కొక్కరి చొప్పున 594 మందిని కేటాయించారు. వీరిలో 393 మందిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా రెగ్యులర్ టైపిస్టులుగా ప్రభుత్వం నియమించింది. 2006లో జీఓనెం.2618, 2011లో జీఓనెం.909 ద్వారా 302 మందిని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించింది. మిగిలిన 212 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు మాత్రం ఏలాంటి ఆర్డర్‌లేదు. కానీ రెవెన్యూ శాఖ వారితో రెగ్యులర్‌గా పనులు చేయిచుకుంటోంది. అయితే వీరిని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులుగా నియమించుకోవడానికి అనుమతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీసీఎల్‌ఏ కమిషనర్ 2016లో లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ ఫైల్‌లో ఏలాంటి కదలికలేదు.
పనులన్నీ వీళ్లకే
రెవెన్యూశాఖలో ఏ పని అయినా వీళ్లే చేయాలి. లేకపోతే అంతేసంగతులు. 12ఏండ్లుగా చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కంప్యూటర్ ఆపరేటర్ల శ్రమ ఎంతో ఉంది. వెబ్ ల్యాండ్, క్రాప్ బుకింగ్, జేఎల్‌ఆర్‌ఎంఎస్ పహణీలు, మీ-సేవా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రజావాణి, రేషన్‌కార్డుల జారీ, ఎన్నికల విధులు, సమగ్ర కుటుంబ సర్వే నివేదికలు, ధరణి, విపత్తుకు సంబంధించిన నివేదికలు, కోవిడ్-19లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రిపోర్టులు, సాదాబైనమా నివేదికలు, ఇంటింటి సర్వేలు, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంశాల వంటి వంటి పనులు రెగ్యులర్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేసినా ఫలితంలేకుండాపోయింది.
గుర్తింపు కరువు
‘పర్మినెంట్ చేయాలని అడగడంలేదు. వేతనాలు పెంచాలని కోరడంలేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానైనా నియమించాలి’ అంటూ కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేటర్లకు ఏలాంటి వేతనం లేదు. మీ-సేవా కేంద్రాలకిచ్చే బడ్జెట్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. దీంతో రూ.10వేలు దాటడంలేదు. ఒక్కోసారి రూ.5వేలు కూడా రావడంలేదని కొంత మంది ఆపరేటర్లు కంటతడి పెట్టారు. నాలుగేండ్లుగా వేతనం కరువైంది. కనీసం గుర్తింపులేదని వాపోయారు.
మంత్రులను కలిసినా..
తమ సమస్యలను పరిష్కరించాలని, రోడ్డున పడ్డ తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆపరేటర్లు గతంలో మంత్రులను కలిసి విన్నవించారు.వారు సీసీఎల్‌ఏనూ కలిశారు. అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను కలిశారు. ఎక్కడికెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్లను కలిస్తే బడ్జెట్ లేదని సమాధానమిస్తున్నారు. విసిగివేసారిన వారు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయానికి వచ్చారు. సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్‌ను కలవడానికి వెళ్లారు. ఆయన బయటికెళ్తూ ‘వీఆర్‌ఏ సమస్య పరిష్కారమయ్యాక చూద్దాంలే’ అనుకుంటూ వెళ్లిపోవడం గమనార్హం.