ఎంసెట్‌ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

– 26 మంది విద్యార్థులకు పదివేల లోపు ర్యాంకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎంసెట్‌ 2023 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారనీ వీరికి మంత్రి గంగుల కమలాకర్‌, ముఖ్యకార్యదర్శి బుర్రావెంకటేశం, కార్యదర్శి మల్లయ్య భట్టు అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షలో అగ్రికల్చర్‌ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంక్‌లు సాధించారని తెలిపారు. 26 మంది విద్యార్థులు పది వేలలోపు ర్యాంకులు సాధించి ఎంసెట్‌ ఫలితాల్లో తమ సత్తా చాటారని పేర్కొన్నారు. 2106 మంది విద్యార్థులు ఎంసెట్‌లో అర్హత సాధించారని తెలిపారు. ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో అందిస్తున్న గురుకుల విద్య విధానం ఫలితంగా వారు ఈ ర్యాంక్‌ లు సాధించారని తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, బీసీ గురుకుల బోధనా సిబ్బందిని మంత్రి అభినందించారు.