ముమ్మరంగా… బీడీ ఆకు సేకరణ

నగదు చెల్లింపులు చేపట్టాలని కూలీల వేడుకోలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల వ్యాప్తంగా బీడీ ఆకు సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఒక పంటగా పేర్కొనే బీడీ ఆకు సేకరణ ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. మండలంలోని పస్రా అటవీ రేంజ్‌ పరిధి రెండు ఆకు సేకరణయూనిట్లు కర్లపల్లి, పస్రా ఉన్నాయి. కర్లపెల్లి ఆకు సేకరణ యూనిట్‌ పరిధిలో అమతండా, లక్ష్మీపూర్‌, సండ్రగూడెం, గాంధీ నగర్‌, మొద్దుల గూడెం, పాపయ్యపల్లి, చంద్రు తండా, బాలాజీ నగర్‌, కర్లపల్లి, గ్రామాల ద్వారా తునికి ఆక సేకరణ కేంద్రాలనుఏర్పాటు చేసి కూలీలు సేకరించి తీసుకువచ్చిన ఆకు కట్టలను ఖరీదు చేసి వరుస క్రమంలో పెడుతుంటారు. ప్రస్తుతం మొద్దుల గూడెం చంద్రు తండా, బాలాజీ నగర్‌, కర్ల పెల్లి ఆకు సేకరణ యూనిట్‌ సేకరణ లక్ష్యం 700 స్టాండర్డ్‌ బ్యాగులు కాగా ఇప్పటివరకు 385 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ జరిగినట్లు యూనిట్‌ ఇన్‌చార్జి డిప్యూటీ రేంజర్‌ శోభన్‌ తెలుపుతున్నారు. త్వరలో లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా ఆకు నాణ్యతకై ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పస్రా యూనిట్‌ పరిధిలో సోమల గడ్డ, దుంపల్లిగూడెం, పసర వన్‌, పస్రా-2, సల్వాయి, బుస్సాపూర్‌, లక్నవరం, దుబ్బగూడా, ఎల్బీనగర్‌, నల్ల గుంట గ్రామాల లో తునికి ఆకు సేకరణ కేంద్రాల ద్వారా ఆకులు సేకరించాల్సి ఉండగా ప్రధానంగా సోమలగడ్డ దుంపెల్లి గూడెం పస్రా-1, పస్రా-2 ద్వారా 700 స్టాండర్డ్‌ బ్యాగులు లక్ష్యం కాగా ఇప్పటివరకు 693 స్టాండర్డ్‌ బ్యాగుల ఆకులు సేకరించినట్లు యూనిట్‌ ఇన్‌చార్జి ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ యూనిట్లో ఇంచుమించు ఎంచుకున్న టార్గెట్‌ దగ్గర పడటంతో యూనిట్‌ అధికారులు మరియు ఆకు సేకరణ విభాగం గిర్దవర్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆకు సేకరణ కూలీలకు నగదు చెల్లింపులు చేయాలని కూలీలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ సంవత్సరం కూలీలకు ఇచ్చే పేమెంట్‌ రూపాయలను ఆన్లైన్‌ విధానంలో కూలీల ఖాతాకు బదిలీ చేయాలని నిబంధన పెట్టారు. ఈ విధానాన్ని కూలీలు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల వివిధ రకాల రుణాలు తీసుకున్న కూలీల డబ్బులను రుణాల్లో జమ చేసుకునే అవకాశం ఉన్నందున అలాంటి పద్ధతికి స్వస్తి పలికి నగదుగా ఇవ్వాలని కూలీలు అంటున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారమే పేమెంట్లు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
ఆకు డబ్బులు నగదుగా ఇవ్వాలి
ప్రభుత్వానికి విక్రయించిన బీడీ ఆకుకు సంబంధించిన డబ్బులను గతంలో మాదిరిగా నగదుగా ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఖాతాలు జమ చేసినట్లయితే గతంలో తాము తీసుకున్న వ్యవసాయ రుణాల్లో బ్యాంకు అధికారులు జమ చేసుకోవడం వల్ల తాము నష్టపోతాం. ఈ నిర్ణయం సరైంది కాదు. ఖాతాలో తమ చేయడం వల్ల ప్రస్తుత అవసరాలకు డబ్బు వినియోగంలోకి రాకుండా ఇబ్బందుల పాలవుతాము ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఖాతాలో జమ చేసే విధానాన్ని రద్దు పరిచి నేరుగా నగదు ఇచ్చే విధంగా అధికారులను ప్రోత్సహించాలి.
: తేజావత్‌ సుక్య, గాంధీనగర్‌, బీడీ ఆకు సేకరణ కూలి