– ఆంధ్ర కొత్త కెప్టెన్ రికీ భుయ్
ముంబయి: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నా, కీలక ముంబయితో పోరు ముంగిట ఆంధ్ర డ్రెస్సింగ్‌రూమ్‌లో అనిశ్చితి అలజడి రేపింది. స్టార్ బ్యాటర్ హనుమ విహారి ఆఖరు నిమిషంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండో రౌండ్ మ్యాచ్ కోసం ఆంధ్ర జట్టు ముంబయికి చేరుకుంది. మ్యాచ్ ముంగిట చివరి ప్రాక్టీస్ సెషన్లో ఆంధ్ర సెలక్టర్లు కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో విహారి కెప్టెన్సీ వదిలేసినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రికీ భుయ్ ఆంధ్ర జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. ‘విహారి బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మేమంతా పదేండ్లుగా ఆంధ్ర జట్టుతో ఉన్నాం. కెప్టెన్ ఎవరనేది పెద్ద విషయం కాదు’ రికీ భురు అన్నాడు. ఆంధ్ర, ముంబయి రంజీ మ్యాచ్ నేడు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది.