– పేటియం షేర్లలో కుదుపు
ముంబయి : పేటియం ప్రమోటర్, సిఇఒ విజరు శేఖర్ శర్మ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు సంబంధించి ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలు ఉల్లంఘించారని మార్కెట్ రెగ్యూలేటర్ సెబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. శేఖర్ శర్మతో పాటు మాజీ బోర్డు మెంబర్లకు కూడా ఈ నోటీసులు అందినట్లు మనీకంట్రోల్ ఓ కథనం వెల్లడించింది. దీంతో సోమవారం పేటియం షేర్లు ఓ కుదుపునకు గురైయ్యాయి. ఓ దశలో ఆ సంస్థ షేర్లు 8.8 శాతం పతనమై రూ.505.25కు దిగజారగా.. అనంతరం కొంత కోలుకుని తుదకు 4.48 శాతం నష్టంతో రూ.530 వద్ద ముగిసింది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ 2021 నవంబర్‌లో ఐపిఒకు వచ్చినప్పుడు క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదు. సెబీకి ఐపిఒ పత్రాలు సమర్పించినప్పుడు విజరు శేఖర్ శర్మ ఆ సంస్థ ఉద్యోగిగా కాకుండా ప్రమోటర్‌గా యాజమాన్య నియంత్రణ కలిగి ఉన్నట్లు తెలిపారు. పేటియం వైఖరిని బోర్డు సభ్యులు ఆమోదిస్తున్నారా? లేదా? తెలుపాలంటూ వారికీ సెబీ నోటీసులు జారీ చేసింది. ఐపిఒలో విజరుశేఖర్ శర్మను లార్జ్ షేర్ హోల్డర్ అని పేర్కొన్నారు. సెబీ నిబంధనల ప్రకారం.. ప్రమోటర్లు ఐపిఒ తర్వాత ఉద్యోగి స్టాక్ ఆప్షన్లు అందుకోవడంపై నిషేధం. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఎక్స్ఛేంజీలు సైతం వివరణ కోరినట్లు తెలుస్తోంది. 2021లో ఐపిఒకు వెళ్లడానికి ముందే పేటియం సిఇఒ విజరు శేఖర్ శర్మ తన వాటాలో 5 శాతం తన కుటుంబ ట్రస్ట్ విఎస్‌ఎస్ హోల్డింగ్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. అనంతరం ఆయన వాటా 9.6 శాతానికి తగ్గింది. దీంతో కంపెనీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించవచ్చునని పేటియం వర్గాలు తెలిపాయి. 10 శాతం లోపే వాటా గల వాటాదారులు కంపెనీని ప్రొఫెషనల్‌గా మేనేజ్ చేయొచ్చునని తెలుస్తోంది.
2021లో పేటియం ఇష్యూ ధర రూ.2150 కాగా.. 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1995 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆ స్థాయికి చేరలేదు. మదుపర్లకు భారీ నష్టాలను మిగిలిచ్చింది. పేటియం తన విలువను పెంచి చూపిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి సరైన డాక్యూమెంట్లు లేకపోయిన వేలాది ఖాతాలు జారీ చేయడంతో పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ ఇటీవల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఆ సంస్థ షేరు ధర రూ.310 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇటీవలే కోలుకుంటున్న పేటియంపై మళ్లీ సెబీ పిడుగు పడింది. సెబీ నోటీసులపై పేటియం స్పందిస్తూ.. ఇదేం కొత్త విషయం కాదని పేర్కొంది. మార్చి 31, జూన్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లోనూ స్టాక్ ఆప్షన్ వివరాలు వెల్లడించామని పేర్కొంది. సెబీకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని తెలిపింది.