– ఐలూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ
– విలేకర్ల సమావేశంలో ఆ సంఘం నేత పార్థసారధి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయ, ఆర్థిక సామాజిక, స్వాతంత్రం ఉండేలా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు దానికి విఘాతం కలిగిస్తున్నారని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పార్దసారధి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఐలూ సహాయ కార్యదర్శి రామచంద్రారెడ్డి, వెంకటేశ్, ప్రవీణ్, ఫాతీమా, సుదర్శన్‌తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ‘రాజ్యాంగం భారతీయులమైన మేము..’ అనే అంశంపై అక్టోబరు 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు పార్థసారధి తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెమినార్‌లో రాజ్యాంగ మౌలిక సూత్రాలు, పున్ణపరిశీలన అనే అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రసంగిస్తారని తెలిపారు. ‘రాజ్యాంగంలో సమాఖ్యతత్వం, వర్తమాన పరిణామాలు’ అనే అంశంపై రాజ్యసభ సభ్యులు జాన్ బిట్రాస్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి టి రజిని మాట్లాడతారని చెప్పారు. ’75 ఏండ్లుగా న్యాయస్థానాల విశ్లేషణ’ అనే అంశంపై ఓడిషా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ మురళీధర్ కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ న్యాయ కళాశాలల్లో రాజ్యాంగం వివిధ కోణాలపై వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులే..దానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ప్రాథమిక హక్కులు హరించే విధంగా ఆర్థిక అసమానతలు పెంచి రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాణం, లక్ష్యాలు ఎదురవుతున్న సవాళ్ళను మన కర్తవ్యంగా భావించి వాటిని ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో భిన్నత్వాన్ని పరిరక్షించడానికి అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి నెలకున్నదన్నారు. రాజ్యాంగంలోని పీఠికలో రాజ్యాంగ, లక్ష్యాలు, ఆశయాలు పొందుపరిచి భారత దేశ సర్వసత్తాక ప్రజాతంత్ర లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.