విశ్వనగరి.. సమృద్ధి జలసిరి..!

–  ప్రగతి సాధించిన జలమండలి
– 100 ఏండ్లయినా చెరగని ముద్ర
– దశాబ్ది ఉత్సవాల్లో తాగునీటి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నీరే సమస్త జీవకోటికి జీవనాధారం.. ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలం కానీ నీరు లేకుండా అసాధ్యం.. కోటికి పైగా జనాభా గల హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటి సరఫరాతోపాటు మురుగు నీటి నిర్వహణ జలమండలి నిర్వర్తిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగర వాసుల దాహార్తిని తీరుస్తోంది. హైదరాబాద్‌ నలుమూలలా తాగునీటి రిజర్వాయర్లతోపాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాకుండా ఔటర్‌రింగు రోడ్డు పరిధి వరకు తాగునీరు సరఫరా చేస్తోంది. రాబోయే 50 ఏండ్ల వరకు తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ 100 శాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 100 ఏండ్లయినా చెరగని ముద్ర వేసుకుంది.
రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌కు అవసరమైన తాగునీరు, పారిశుధ్యం నిర్వహణ పటిష్టంగా ఉంటేనే విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జలమండలికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. పురపాలక మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దాన కిశోర్‌ నాయకత్వంలో తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థంగా నిర్వహిస్తూ జలమండలి ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ, జీహెచ్‌ఎంసీతోపాటు ఔటర్‌ రింగురోడ్డు లోపలి గ్రామాలకు సైతం తాగునీరు అందిస్తుంది. నగర శివారు ప్రాంతాల వరకు సివరేజీ నిర్వహణ బాధ్యతలు చేపట్టి తన సేవలను మరింత విస్తృత పరిచింది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీ నరసింస్వామి ఆలయం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిసరాల్లో భూగర్భ డ్రయినేజీ, వరద నీటి కాలువ వ్యవస్థల నిర్మాణ బహత్తర ప్రణాళికను రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జలమండలిపై పెట్టింది. ఈ బాధ్యతను జలమండలి సమర్థంగా నిర్వహించి పూర్తి చేసింది.
వరుసగా అయిదేండ్లు కరవు వచ్చినా..
నగరంలో వరుసగా ఐదేండ్లు కరువు వచ్చినా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా సుంకిశాల వంటి ప్రాజెక్టు రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. అధునాతన సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఎఫ్‌ఎస్టీపీలను ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తోంది. తక్కువ ధరకే వినియోగదారులకు సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ సేవల్ని అందిస్తోంది.
తొమ్మిదేండ్లలో జలమండలి సాధించిన మైలురాళ్లు
రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాదిలో సీఎం కేసీఆర్‌ మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి రూ.338.54 కోట్లతో 9 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణానికి నవంబర్‌ 2, 20214న శంకుస్థాపన చేశారు. 2015లో వాటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.
కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్‌-3ని 2015 నవంబరులో ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబరులో గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్‌ – 1ని ప్రారంభిం చారు. కృష్ణా ఫేజ్‌ – 3 వల్ల 90 ఎంజీడీలు, గోదావరి ఫేజ్‌ – 1 వల్ల జంట నగరాలకు 85 ఎంజీడీల నీటి సరఫరా అదనంగా పెరిగింది.
ప్రసిద్ధి చెందిన హుస్సేన్‌ సాగర్‌ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూకట్‌పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని హుస్సేన్‌సాగర్‌లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దీనికోసం ప్రభుత్వం రూ.58.96 కోట్లు వెచ్చించింది.
ఒక నిర్ధిష్ట ప్రాంతంలో 1000 నుంచి 1500 వరకు క్యాన్‌ నంబర్లకు ఒక డాకెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని వల్ల వినియోగదారుల నల్లా కనెక్షన్ల నుంచి బిల్లింగ్‌, రెవెన్యూ కలెక్షన్‌ తదితర అంశాలను సులభంగా పర్యవేక్షించవచ్చు.
మాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిర్మూలన – జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్‌కు చెందిన బెజవాడ విల్సన్‌ సమన్వయంతో మాన్యువల్‌ నిర్మూలనపై జలమండలి కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇంకుడు గుంతల ప్రాధాన్యం, జలభాగ్యం కార్యక్రమం కింద జలమండలి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేసింది. రెండేండ్లలో (2016-17) సుమారు 7500 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది.
హైదరాబాద్‌లో పారిశుధ్య నిర్వహణ మెరుగు పర్చడమే లక్ష్యంగా.. 70 నూతన సీవర్‌ క్లీనింగ్‌ జెట్టింగ్‌ యంత్రాలను 2017 జూన్‌ 6న ప్రారంభించారు.
తాగునీటి సరఫరా, శుద్ధి, పంపింగ్‌, స్టోరేజీ, ట్రాన్స్‌ మిషన్‌, క్లోరినేషన్‌లో జలమండలి చేపడుతున్న నాణ్యతా పద్ధతులకు 2017 జులై 14న ఐ.ఎస్‌.ఒ నుంచి ధ్రువ పత్రం లభించింది.