బీజేపీకి వివేక్‌ ఝలక్‌

– నేడో..రేపో కారుపార్టీలో చేరిక
– పెద్దపల్లి ఎంపీ సీటు కన్ఫర్మ్‌ !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి బీజేపీకి గట్టి ఝలక్‌ ఇవ్వనున్నారు. ఆయన నేడో, రేపో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆయనతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు, పెద్దపల్లి ఎంపీ సీటు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కూడా సుముఖం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఈ డీల్‌కు ఓకే చెప్పేసి కారెక్కేందుకు మొగ్గుచూపుతున్నారు. చేరికకు సంబంధించి ప్రగతిభవన్‌ నుంచి కూడా ఆహ్వానం అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ విప్‌ బాల్కసుమన్‌ ఆయనతో భేటీ అయిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నంత కాలం బీజేపీలో వివేక్‌ దూకుడుగా వ్యవహరించారు. ప్రస్తుతం బండి సంజయ్, ఈటల రాజేందర్‌, కిషన్‌రెడ్డిలకే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తూ మిగతా సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వట్లేదనే చర్చ కొద్దికాలంగా జరుగుతున్న విషయం విదితమే. ఆయా పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఒక దగ్గర భేటీ అయ్యి ఇదే అంశంపై పలుమార్లు చర్చించిన సంగతీ తెలిసిందే. అయితే, ఆ నేతల్లో చాలా మంది కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతుండగా.. వివేక్‌ మాత్రం బీజేపీ గోడ మీద నిలబడి ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్‌ టూ బీజేపీ వయా బీఆర్‌ఎస్‌ అన్నట్టుగా పార్టీలు మారుతూ పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయన చేరిక పట్ల అంత సుముఖత చూపలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటే ఎట్లాగూ గెలవలేం..బీఆర్‌ఎస్‌లోకి వెళ్తే ఎంపీగానైనా గెలిచి రాజకీయంగా కొంత మేర పెద్దపల్లి జిల్లాలో మళ్లీ పట్టు సాధించాలనే ఆలోచనకు వివేక్‌ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన కారెక్కేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణపై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి ఇది మింగుడు పడని విషయమే.