– కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం 400 మంది అరెస్టు, విడుదల
– వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదు
– సమ్మెపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నేడు నిరసనలు
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
సమస్యల సాధన కై వీవోఏలు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 36 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ ఐకెేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ ముట్టడికి జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వివోలతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాగా పోలీసులు ముందస్తు చర్యగా ప్రధాన ద్వారానికి తాళం వేశారు. గేట్ బయట శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న సుమారు నాలుగు వందలకు పైగా వివోఏ లను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయగా ఇరువురి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత కు దారితీసింది. పోలీసులు నిరసన తెలుపుతున్న నాయకులు, వివో లను బలవంతంగా అరెస్టు చేసి వివిధ ప్రాంతాలలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. నల్లగొండ లోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్, అదేవిధంగా తిప్పర్తి, మునుగోడు మండల కేంద్రంలలోని పోలీస్ స్టేషన్ లకు తరలించి మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఐకెపి వివో ఏ ఉద్యోగుల వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదని మరింత ఉధతం చేస్తామని రాష్ట్ర
ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 వేల మంది వివోఏలు 40 లక్షల డ్వాక్రా సంఘాల మహిళలను సామాజికంగా ఆర్థికంగా ముందు తీసుకుపోవడంలో ఐకెపి వివోఏలు గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారని అన్నారు. వీవో ఏలు మండుటెండల్లో తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా గత 36 రోజులుగా సమ్మె చేస్తున్న కనీస కనికరం లేకుండా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్నారు. సమ్మెపై నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ నేడు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐకెపి వివో ఏలు అడుగుతున్న డిమాండ్లేవి గొంతెమ్మ కోరికలు కాదని కనీస వేతనం26 వేలు,సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తింపు, అర్హత గల వారిని సిసిలుగా నియమించుట,గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా ఇవి ఏవి ప్రభుత్వానికి అమలు చేయడానికి అలవికానివి కూడా కాదని అన్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం సమ్మె పట్ల కాలయాపన ఇలాగే కొనసాగితే ఈనెల 29న సెర్ఫ్ సీఈఓ ముట్టడి చేస్తామని ఆ తర్వాత సమ్మె మరింత సమరశీలంగా మారుతుందని హెచ్చరించారు. అదిరించి. బెదిరించి సమ్మెను విచ్చిన్నం చేయాలనుకుంటే మూర?త్వం అవుతుందని అన్నారు. ఆడబిడ్డలు తమ తోటి ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే సీసీలు, ఏపీఎంలు వేధింపులకు గురి చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఉపాధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కె శరత్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ దుర్గయ్య,సంఘం జిల్లా నాయకులు జంగయ్య,ఎస్.కె సైదా బేగం,ఎం మంగమ్మ, అహల్య, వై. కోటిరెడ్డి, సుమీల,రేణుక,చంద్రకళ నాగమణి,సులోచన,లక్ష్మి,జి.సువర్ణ, భద్రయ్య, సంధ్య,పుష్పలత, ముని నాయక్,అజరు, నాగలక్ష్మి రాణి, మంజుల,వసంత సువర్ణ తదితరులు పాల్గొన్నారు.