శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యమే కీలకం

Voter awareness is the key in legislative elections2023 నవంబర్‌ 30న తెలంగాణ శాసనసభకు పోలింగ్‌ జరుగబోతున్నది. వివిధ రాజకీయ పార్టీలు తమకే ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం సాగిస్తు న్నారు. ఆకర్షణీయమైన మ్యానిఫెస్టోలు ప్రకటించారు. గతంలో ప్రకటించిన మ్యానిఫెస్టోలు ఎంతవరకు అమలయ్యాయి? పరిశీలిస్తే పాలక పార్టీల మ్యాని ఫెస్టోలు ఎక్కువ శాతం కాగితాలకే పరిమితమయ్యాయి. నామినేషన్లు ప్రారంభం కాకముందు నుండే అభ్యర్థుల ప్రచారం సాగుతున్నది. వాహనాలపై ఆకర్షణీయ ప్రచారం, సోషల్‌ మీడియా వినియోగం, పట్టుక వచ్చిన జనంతో బహిరంగసభలు, రోడ్‌షోలతో విపరీతమైన హడావిడి చేస్తున్నారు. పాలకవర్గాలు పథకాలు ప్రారంభించడం, అమలు చేయకుండా పక్కన పడేస్తున్నారు. దళితుల మూడెకరాల భూ పంపిణీ, దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, పంటల బీమా, కనీస మద్దతు ధరల అమలు, అందరికీ విద్య, అందరికీ వైద్యం, ఆవాసాల కల్పన, ఉపాధి కల్పనల కోసం ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌ కోసం పోరాడుతున్నారు. కనీస వేతనాల అమలుకు నిరంతర ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం పూర్తి కాకుండానే మ్యానిఫెస్టో అమలు జరిగిపోయినట్టు, ప్రజల జీవనా దాయం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో తలసరి ఆదా యం పెరిగినప్పటికీ, ఆదే స్థాయిలో ప్రజల దారిద్య్రం కూడా పెరుగుతున్నది. అయి నప్పటికీ దేశంలో రాష్ట్రం ప్రథమ స్థాయిలో ఉన్నట్లు చెపుతున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. పైగా, పాలక వర్గంలోని వారితో సహా పలుకుబడి కలిగిన వారి ఫాంహౌజ్‌ల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారు. చివరి ఆసైన్డ్‌ భూములతో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణను పెద్దఎత్తున సాగుతున్నాయి. గ్రామీణ సీలింగ్‌ చట్టం అటకెక్కింది. చట్ట విరుద్ధంగా భూ సేకరణ జరుగుతున్నది. ల్యాండ్‌ ఫూలింగ్‌ అనే కొత్త పథకం ద్వారా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అభివృద్ధి కోసం పేదల భూములు లాక్కుంటున్నారు. సాగుదార్లను, కౌలు దార్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించారు. రెవెన్యూ కోర్టుల రద్దుతో వేల కేసులు సివిల్‌ కోర్టుకు వెళ్తున్నాయి. అధిక ఫీజులు చెల్లించి సివిల్‌ కోర్టులలో కేసులు వేస్తున్నారు. అవి పరిష్కారం కావడానికి విపరీత కాలయాపన జరుగుతున్నది. గ్రామాభివృద్ధి చేస్తామని ఎంతో ఉత్సాహంతో ఎన్నికైన సర్పంచ్‌లు తమ సొంత డబ్బు లేదా అప్పులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏండ్లు గడిచినా చేసిన పనులకు నిధులు రాకపోవడంతో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా సక్రమంగా గ్రామాలకు రావడం లేదు. అక్ష్యరాస్యతలో రాష్ట్రం నేటికి 66.4 శాతం మాత్రమే ఉంది. గ్రామాలలో ప్రయివేటు పాఠశాలల ప్రభావం విస్తరిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోయి, పాఠశాలలు రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. వైద్య రంగం గ్రామీణ స్థాయిలకు విస్తరిస్తుందని చెప్పినప్పటికీ పేదలకు తగిన సహాయం అందడం లేదు. మ్యానిఫెస్టోలలో ఆరోగ్యశ్రీకి లక్షల రూపాయలు కేటాయించి నప్పటికీ ప్రయివేటు హాస్పిటల్స్‌లో పేదలకు వైద్య సౌకర్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తిరిగి ఆరోగ్య శ్రీకి ప్రతి మనిషికి రూ.15 లక్షల వరకు వైద్యం చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో 25-30 శాతం నిరుద్యోగులు పెరిగారు. చేసిన వాగ్దానాలు అమలు కాలేదు. ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షలు వృథా అయ్యాయి. పట్టణాలకు వలసొచ్చిన కార్మికులు పనులు కోల్పోయి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఉపాధి తగ్గిపోతున్నది. గ్రామాలకు వచ్చిన వలస కార్మికులు వ్యవసాయేతర పనుల కోసం వేట సాగిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ప్రజలపై భారాలు
ప్రభుత్వ బడ్జెట్‌కు ఆదాయం పెంచుకోవడానికి మద్యం, భూముల రిజిస్ట్రేషన్‌, వాహన పన్నుల ద్వారా పేదలపై భారం వేస్తున్నారు. ప్రజలు ఆదాయంలో పెద్ద మొత్తం మద్యం కోసం వ్యయం చేస్తున్నారు. బెల్ట్‌ షాపుల పేరుతో ప్రతి వార్డుకు షాపులు పెట్టారు. ఎక్స్తెజ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఎక్కువ మద్యం అమ్మకాలు సాగాలని ఒత్తిడి తెస్తున్నారు. పేదలు కొనుగోలు చేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగడంతో కొనుగోలు నిలుపుదల చేశారు. దీనికితోడు ఉపాధి హామీ పనుల్లో యంత్రాల శాతాన్ని 45 శాతం వరకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టానికి కేటాయింపులు పెద్ద ఎత్తున తగ్గించింది. ఉపాధి హామీ పనులు జరిగినప్పటికీ చెల్లింపులకు నెలల తరబడి కాలయాపన జరుగుతున్నది. ఆర్థిక భారాలకు తోడు కుల, మత పరమైన తగాదాలతో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. మహిళాలపై ఆఘాయిత్యాలు, బాలికల అమ్మకాలు జరుగుతున్నాయి. షీటీంలు పెట్టినప్పటికీ నేరాల సంఖ్య పెరుగుతున్నదే తప్ప, తగ్గడం లేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరిగినప్పటికీ 30 శాతం ప్రజల ఆర్థిక ఆదాయం తగ్గి దారిద్య్రంలోకి నెట్ట బడుతున్నారు. అయినా, పెటుబడిదారులకు లాభాలు కట్టబెట్టే పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో పేదలకు అనేక పథకాలు ప్రకటిస్తున్నారు. భ్రమలు కల్పిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఓటర్లు రాజకీయ పార్టీల హామీలను, గత చరిత్రను తెలుసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
వామపక్ష పాలిత రాష్ట్రాల అభివృద్ధి
కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపురలలో వామపక్షాలు 30 సంవత్సరాల పాటు పరిపాలన సాగించి దేశంలో అత్యున్నత స్థానంలో రాష్ట్రాలను నిలబెట్టాయి. ప్రస్తుతం కేరళ ప్రభుత్వం మార్గదర్శకంగా, పారదర్శకంగా పనిచేస్తున్నది. ఆ ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయడానికి వ్యతిరేక వర్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన అక్కడి ఓటర్లు వరుసగా రెండవ సారి సీపీఐ(ఎం) పార్టీని బలపరిచారు. ఈ రాష్ట్రాలలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయి. పేదలందరికీ భూమి లభించింది. ముఖ్యంగా అక్ష్యరాస్యతలో 96-100 శాతం అభివృద్ధి సాధించారు. మహిళల అక్ష్యరాస్యత కూడా 96 శాతానికి పెంచారు. ఈ మూడు రాష్ట్రాల అక్ష్యరాస్యతను పరిగణనలోకి తీసుకోవడం వలన దేశంలో అక్ష్యరాస్యత 74.6 శాతానికి పెరిగింది. ఉపాధిహామీ పనులు ఈ రాష్ట్రాల్లో పారదర్శకంగా జరిగాయి. ప్రజల జీవన ఆదాయం పెంచడానికి ఉపాధి కల్పన పథకాలు పెద్ద ఎత్తున అమలు జరిపారు. వైద్యరంగంలో అభివృద్ధి సాధించారు. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు దేశంలోనే అతి తక్కువ ఉన్నాయి. పౌష్టికాహార లోపం 20 శాతానికి తగ్గింది. ప్రతి పనికి కనీస వేతనాలు అమలు చేస్తున్నారు. కేరళలో దినకూలి రూ.758లు ఇస్తున్నారు. ధాన్యానికి బోనస్‌గా క్వింటాలుకు రూ.800లు ఇస్తున్నారు. మధ్య దళారీల పాత్రకు స్వస్తి పలికారు. స్థానిక సంస్థలకు 73,74 రాజ్యాంగాన్ని అమలు జరుపడమేగాక రాష్ట్ర బడ్జెట్‌లో 45 శాతం నేరుగా స్థానిక సంస్థలకు కేటాయించారు. సాగునీటి వనరులు గ్రామ పంచాయితీ నిర్వహిస్తున్నది. అవినీతి రహిత పాలన సాగిస్తున్నారు. 30 ఏండ్ల పాలనలో ఏ ఒక్క మంత్రిగాని, శాసన సభ్యుడుగాని చివరికి గ్రామ పంచాయతీ పాలకులు గానీ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. వామపక్షాల పాత్ర లేని రాష్ట్రాలలో అధికారానికి వచ్చిన సంవత్సరంలోపే పెద్ద ఎత్తున అవినీతిని పెంచి పోషిస్తున్నది. కోట్ల రూపాయలు ఆక్రమ సంపాదన సాగిస్తున్నారు. అంతేగాక కుల, మత ఘర్షణలు సృష్టిస్తున్నారు. మన బానిస కాలం నాటి కుల బహిష్కరణలు నేటికి కొనసాగుతున్నాయి. బానిస సమాజంలోని లక్షణాలను చాలా ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, దళితుల అంటరానితనం నేటికి కొనసాగిస్తున్నారు. ఈ అవలక్షణాలు వామపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో కనబడవు. అందువల్ల కమ్యూనిస్టులను గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలోని అభ్యర్థులను పెద్ద మెజార్టీతో గెలిపించాలి. చైతన్య యుతంగా పరిశీలించి కమ్యూనిస్టులకు ఓట్లు వేసి తెలంగాణ పోరాట చరిత్రను పున:స్థాపితం చేయాలి. అందుకు ఈ శాసన సభ ఎన్నికలలో ప్రజలు చైతన్యయుతంగా ఓట్లు వినియోగించాలి.
సారంపల్లి మల్లారెడ్డి