బాబు అరెస్టుపై ‘ఓట్ల’ మాటలు..!

Words of 'votes' on Babu's arrest..!– రాజకీయ లబ్ది కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆరాటం
– ఇరుపార్టీల అధినాయకత్వం దాటవేత ధోరణి
– ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల ‘స్కిల్స్‌’ ప్రదర్శన
– టీడీపీ ఫ్యాన్స్‌ ఓట్ల కోసం లేని ప్రేమ ఒలకబోత
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విశ్వయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల అధినాయత్వం బాబు అరెస్టుపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేసినా ఓట్ల వేటలో భాగంగా ఇరు పార్టీల జిల్లా నాయకత్వం మాత్రం లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ టీడీపీ అభిమానుల ఓట్లకు గాలం వేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుపై ఇటు బీఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్‌ అధినాయకత్వం దాటవేత ధోరణితో మాట్లాడుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్థికమంత్రి హరీశ్‌రావు సభా వేదికలపై గానీ, ప్రెస్‌మీట్‌లలో గానీ ఈ ప్రస్తావనే తేవట్లేదు. విలేకరులు అడిగినా ‘పక్క రాష్ట్రాల విషయాలు మనకెందుకు’ అంటున్నారు. చంద్రబాబుతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లోకి వచ్చాక బాబు ఊసు ఎత్తడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి కీలకనేత, సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టివిక్రమార్క సైతం దీనిపై స్పందించ లేదు. విజయభేరి సన్నాహక సభ సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ బాబు అరెస్టుపై భట్టిని ప్రశ్నిస్తే దాటవేత ధోరణిలో మాట్లాడకొచ్చారు. కానీ ఏపీ సరిహద్దున ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల ప్రకటనలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి. ఓట్ల రాజకీయాల్లో భాగంగా బాబుపై లేనిప్రేమను ఒలకబోస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇప్పటికీ టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉంది. ఈ నేపథ్యంలో బాబు అరెస్టు ఘటనను అడ్డుపెట్టుకొని ఎలాగైనా తెలుగుదేశం అభిమానుల ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నాలు విపరీతంగా సాగుతున్నాయనే చర్చ మొదలైంది.
టీడీపీ ఓట్లపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల కన్ను..
ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఏపీ రాజకీయ పరిణామాల ప్రభావం ఉంటుంది. చంద్రబాబుకు ఇక్కడ అభిమానులు భారీగానే ఉన్నారు. నేతలు పార్టీ మారినా అభిమానులు మాత్రం ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబు అరెస్టుపై ‘సానుభూతి’ని ప్రకటించి టీడీపీ అభిమానుల ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే చర్చ సాగుతోంది.
ఆలస్యం.. అపహాస్యం..
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమాల ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఈనెల 9వ తేదీన అరెస్టు చేస్తే.. తీరుబడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు స్పందిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం ఉంటే అరెస్టయిన వెంటనే ఖండిస్తూ ప్రకటనలు చేసేవారని, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఆలస్యంగా స్పందిస్తున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. బాబు అరెస్టయిన మూడు, నాలుగు రోజుల తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఖండించారు. ఆ తర్వాత రెండు రోజులకు గురువారం మమత హాస్పిటల్‌ సిల్వర్‌ జూబ్లీ మీటింగ్‌లో మంత్రి పువ్వాడ స్పందించారు. దాదాపు వారంరోజుల తర్వాత అశ్వారావుపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ప్రకటన చేశారు. దీనికి ఒకటి, రెండు రోజుల ముందు మధిర బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమలరాజ్‌ ఖండించారు. ఇక బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లోకి చేరేందుకు సమాయత్తం అవుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆలస్యంగానే ప్రకటన చేశారు. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు శుక్రవారం ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
చర్చనీయాంశంగా పొంగులేటి అనుచరుల ప్రకటన..
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మువ్వా విజరుబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య పేరుతో శుక్రవారం వెలువడిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టివిక్రమార్క బాబు అరెస్టుపై వెంటనే స్పందించారని, దీనికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆలస్యంగా స్పందిస్తున్నారని విమర్శలు చేశారు. కానీ భట్టి అనుయాయులు మాత్రం తమ నేత ఎక్కడా ప్రకటన చేయలేదని అంటున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయ గురువుగా భావించే పొంగులేటి కార్యాలయం నుంచి బాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన వెలువడటం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితమే ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు పొంగులేటి వెళ్లారు. ఆ క్రమంలో ఆయన అనుచరులపై ‘గులాబీ’ టీడీపీ అభిమానులు దాడి చేశారు. శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి వెళ్లాక విగ్రహాన్ని సైతం పాలతో శుద్ధి చేశారు. కాగా పొంగులేటి అనుచరులు బాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన చేయడంపై పొంగులేటి అనుచర గ్రూపులోనూ పలువురు వ్యతిరేకిస్తున్నారు.