వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి

– ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి :వీఆర్‌ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారమివ్వాలనీ, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వీఆర్‌ఏ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆదివారం నిర్మల్‌ జిల్లా అర్బన్‌ మండలానికి చెందిన సిద్ది శ్రీనివాస్‌ మృతదేహాన్ని వీఆర్‌ఏ జేఏసీ కార్యదర్శి ఎస్‌కే దాదేమియా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్‌ సందర్శించారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌(45) చెరువు నీళ్లు వదలడానికెళ్లి తూములో పడి చనిపోయాడని తెలిపారు. జాబ్‌చార్టులోని లేని పనులను కూడా వీఆర్‌ఏలతో కలెక్టర్లు, తహసీల్దార్లు చేయిస్తున్నారని విమర్శించారు. శ్రీనివాస్‌ మృతికి అధికారులే కారణమన్నారు. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వీఆర్‌ఏలకిచ్చిన పేస్కేలు, ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌కే జమాల్‌, జేఏసీ చైర్మెన్‌, కన్వీనర్‌ ప్రవీణ్‌, జిల్లా అధ్యక్షులు బోజన్న, ఇర్పాన్‌, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.