ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– సీఐటీయూ ఆధ్వర్యంలో జీపు జాత
నవతెలంగాణ-షాద్‌నగర్‌
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వేతనాలను సవరించాలని, రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు గత 15 ఏండ్లుగా కనీస వేతనాలు సవరించలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన జీపు జాత కాటేదన్‌ మీదుగా షాద్‌నగర్‌ పట్టణానికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ పాల్గొని మాట్లాడారు. ఐదు సంవత్సరాల కొకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వేతనాలు సవరించాలని తెలిపారు. కానీ 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేతనాలు సవరించకుండా అన్యాయం చేసిందన్నారు. కనీస వేతనాలు పెంపుదల కోసం కార్మిక చట్టాల అమలు కోసం గత 10 సంవత్సరాలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, ప్రతి పరిశ్రమలో కాంట్రాక్ట్‌ కార్మికులు నూటికి 90శాతం పైగా ఉంటున్నారని అన్నారు. హమాలీలు మొదలుకొని భారీ పరిశ్రమలోని స్కిల్డ్‌ వర్కర్స్‌ వరకు వలస కార్మికులు అధిక సంఖ్యలో ఉంటున్నారని వివరించారు. ఇందులో కూడా 80శాతం బీహార్‌, ఒరిస్సా, బెంగాల్‌, ఛత్తీస్‌ ఘడ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర మరియు ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర వలస కార్మికులే అత్యధికులు ఉన్నారని అన్నారు. మహిళా కార్మికులు కూడా గణనీయంగా ఉన్నారని, రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌1979 అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం అమలు కావడం లేదని అన్నారు. అలాగే పిఎఫ్‌, ఈఎస్‌ఐ సెలవులు, బోనస్‌, గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, రోజుకు 12 గంటలు పని చేయించుకుంటున్నారని అన్నారు.
ఓవర్‌ టైం చేస్తున్నా..వేతనాలు చెల్లించడం లేదు
భారీ పరిశ్రమలో కాంట్రాక్టు, క్యాజువల్‌, ట్రైనీలు, లాంగ్‌ టర్మ్‌ ట్రైనీలు, ఫిక్స్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ నీమ్‌, న్యాప్స్‌, న్యాట్స్‌ లాంటి అప్రెంటీస్‌ స్కీమ్ల ద్వారా నియమింపబడిన వారిని ఉత్పత్తిలో శాశ్వత కార్మికులతో సమానంగా పని చేయిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. వలస కార్మికులనైతే కంపెనీల ఆవరణలో చిన్న చిన్న గదులలో 10 నుంచి 15 మందిని పెట్టి కనీస సౌకర్యాలు లేకుండా బానిసల మాదిరి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, కార్మిక శాఖ పర్యవేక్షణ లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప కార్మికులకు న్యాయం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం వేతనాలను సవరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కనీస వేతనాల సాధన కోసం 2023 జూలై 4 నుండి జూలై 13 వరకు జరుగు జీపు జాతాను జయప్రదం చేయాలని కోరారు. జూలై 17న అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల పికెటింగ్‌ లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులు పని గంటలు ఎక్కువ చేసినా దానికి తగట్టు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌. రాజు, చంద్రమోహన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్‌ , గిరిజన సంఘం జిల్లా నాయకులు ఈశ్వర్‌ , ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, సీఐటీయూ నాయకులు రాజశేఖర్‌, జయమ్మ, ఇందిర, ఊర్మిళ, భవన నిర్మాణ కార్మికులు రాములు, మైలారం జంగయ్య, వెంకటేష్‌, జంగయ్య, గోపాల్‌, కష్ణయ్య, హమాలీ యూనియన్‌ నాయకులు శ్రీను, లింగం, మధ్యాహ్న భోజనం కార్మికులు చిట్టెమ్మ, సరోజ, జెవివి నాయకులు కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.