– 8న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
– ప్రజలకు మరోసారి బీజేపీ ప్రభుత్వం మొండిచేయి
– రైల్వే కార్మిక సంఘాల్లో భిన్న వాదనలు
– వరంగల్ వాసుల్లో అసంతృప్తి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ పీరియాడిక్ ఓవరాయిలింగ్ (పీఓహెచ్) యూనిట్‌ను మంజూరు చేయడంతో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 8వ తేదీలోపు జీఓ కూడా వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పిన విషయం విదితమే. కేంద్ర కేబినెట్ సమావేశం జరిగినా.. మంత్రి చెప్పినా… జీఓ మాత్రం రాలేదు. కాగా, ఈనెల 8వ తేదీన ప్రధాని మోడీ వరంగల్‌కు వచ్చి వ్యాగన్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్న తరుణంలో రైల్వే కార్మిక సంఘాల్లోని కొన్ని సంఘాలతో.. వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుకూలంగా ప్రకటన ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే వ్యాగన్ పరిశ్రమకు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తేడా తెలియదని పలు రైల్వే కార్మిక సంఘాలు చెప్పడం పట్ల విమర్శలకు తావిస్తోంది. ‘జాక్’ పేరిట పలు రైల్వే కార్మిక సంఘాలు ప్రజల చిరకాల వాంఛకు భిన్నమైన వాదనను తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ నాయకుల ప్రేరణ ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటులో భాగంగా పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీతోపాటు, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే దశాబ్దాలుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలనే డిమాండ్ ఉంది. ఇందుకు రైల్వే కార్మిక సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు సైతం ఉద్యమించాయి. ఈ క్రమంలో 1985లో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా వివిధ కారణాలతో ఆ పరిశ్రమను పంజాబ్‌లోని కపుర్తాలకు తరలిపోయింది. ఇది కాజీపేటకు తొలిసారి జరిగిన ఆశాభంగం. కపుర్తలాలో రూ.888 కోట్ల అంచనా వ్యయంతో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించగా, ఏటా 1,500 కోచ్‌లను తయారు చేస్తున్నారు. 6,623 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అనంతరం రారుబరేలిలో 2007లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రూ.3,192 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించి, కాజీపేటలో వ్యాగన్ పీరియాడిక్ ఓవరాయిలింగ్ యూనిట్‌ను మంజూరు చేసింది. దాంతో రాష్ట్ర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విమర్శలు పెరగడంతో కాజీపేటలో పీఓహెచ్ యూనిట్ స్థానంలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని రూ.521 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, 2019లో విశాఖపట్నంకు రూ.150 కోట్లతో పీఓహెచ్ యూనిట్‌ను మంజూరు చేసింది.
కోచ్‌కు, వ్యాగన్‌కు తేడా లేదా..?
రైల్వే కోచ్‌లకు, రైల్వే వ్యాగన్‌లకు తేడా తెలియనంత అమాయకులుగా ప్రజలను కేంద్ర ప్రభుత్వం భావించడం విస్మయాన్ని కలిగిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై రాజకీయ విమర్శలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైల్వే కోచ్‌లు ప్రయాణీకులు ప్రయాణించేవి కాగా, వ్యాగన్‌లు వస్తువులను రవాణా చేసేవి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు అధికంగా ఉండటమే కాకుండా చాలా యూనిట్లు ఇందులో భాగంగా పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాగన్ పరిశ్రమలో కంటే రైల్వే కోచ్‌లో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఈ తేడాలు ప్రజలకు తెలియదని బీజేపీ నేతలు వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఒక్కటేనన్న విధంగా ప్రచారం చేయడం గమనార్హం.