ఉరుకుల పరుగుల యుక్త వయస్సు
మనస్సున కోరికల సీతాకోకచిలుకలు
కల్మషం లేని మనస్సు
లోకమంతా రంగుల ప్రపంచం!
ఏది చూసిన దశ్యమాలికనే
ఆకాశాన ఎగురుతున్న ఆశలు
అన్నీ అందుకోవాలి అనే ఊసులు
స్వర్గాన్ని అరచేతిలో చూస్తున్న వైనం!
బలమైన కోరికతో మోహానికి లోనయి
బలహీనమైన క్షణంలో మోసపోయి
తెలిసిన క్షణం మనసంతా అల్లకల్లోలం
వేదనా సెగలు ఆవేదనా భగభగలు!
కన్నీటి దారలు
కన్న వారికి చెప్పుకోలేని బాధలు
ఆగని కన్నీళ్లు
తుడుచుకోవాలన్న ధ్యాసే లేదు!
యవ్వనంలో తడబడితే
తప్పు అడుగే కదా
లోకానికి తెలిస్తే లోకువ
తప్పు మోయాలా? కడిగేయాలా?
తనువంతా తడుస్తూ
తనివి తీరా ఏడుస్తూ
కనిపించకుండా కన్నీరు
వరంలా కురుస్తున్న వర్షం!
ఆవేదనలోనుండి ఆలోచనల్లోకి
తప్పు అడుగును సరిదిద్దుకోవాలని
చేసిన పాపాన్ని కడిగేసుకోవాలని
కడిగిన ముత్యంలా ముందుకెళ్ళాలని!
– జగ్గయ్య.జి, 9849525802