మేం అడిగిన సీట్లు ఇస్తారన్న నమ్మకముంది

We are confident that they will give us the seats we asked for–  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తాము అడిగిన సీట్లు ఇస్తారన్న నమ్మకముందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో నిర్వహించారు. అనంతరం మీడియాతో రాజా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఇండియా కూటమిలో తమ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కలిసొచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ కొత్తగూడెం, బెల్లంపల్లి సీట్లు కోరామన్నారు. కొత్తగూడెం, చెన్నూరు ఇస్తామన్నారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) సీట్లపై చర్చ జరుగుతున్నదని వివరించారు. ఇండియా కూటమి బలపడడం వల్ల బీజేపీని నిలువరించొచ్చని చెప్పారు. కాంగ్రెస్‌లో వివేక్‌ చేరడం మంచి పరిణామమని అన్నారు. చెన్నూరులో సీపీఐ గెలుపునకు ఆయన కృషి చేయాలనీ, పార్లమెంటు ఎన్నికల్లో వివేక్‌ విజయం కోసం పనిచేస్తామని చెప్పారు. అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేమన్నారు. చంద్రబాబు అరెస్టు కక్షపూరితమైందనీ, న్యాయం బతికే ఉందనడానికి బెయిల్‌ నిదర్శనమని అన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉన్నారనీ, బయట ఉండాల్సిన వాళ్లు లోపల ఉన్నారని చెప్పారు. ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చల దశలో ఉందన్నారు. కాంగ్రెస్‌ తుది జాబితా ప్రకటించే వరకు వేచిచూస్తామని చెప్పారు. ఆ తర్వాత తమ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గురువారం ముఖ్యనేతల సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌తో అవగాహనలో భాగంగా తమకు రెండు సీట్లు ఇస్తామందనీ, మాట నిలబెట్టుకుంటుందని అనుకుంటున్నా మని అన్నారు.