2010లో గాయత్రి వైద్యనాథన్ తన కెరీర్ నుండి ఏడేండ్లు సుదీర్ఘ విరామం తీసుకున్నారు. అయితే ఆమె తన వృత్తిలో ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. పరిశ్రమలో అత్యాధునిక ప్రాజెక్టులతో ఉత్తేజకరమైన సంఘటనలను చూస్తున్నారు. వాస్తవానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో విరామం అనేది అసలు కెరీరే లేకుండా చేస్తుంది. కానీ ఆమె తిరిగి పుంజుకున్నారు. అంతేకాదు నాలుగేండ్లలో లోవ్స్ ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
‘నా విరామం తర్వాత టార్గెట్‌లో ఇంటర్న్‌గా నా కెరీర్‌ను పున:ప్రారంభించాల్సి వచ్చింది. ఆఫీస్ బెంగుళూరులో ఉంది. వారాంతాల్లో హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి ఉండేందుకు వెళ్లేదాన్ని. నేను చేస్తున్నది సరైనదేనా, నా కుటుంబాన్ని వదిలేసి నేను పొరపాటు చేస్తున్నానా.. అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి’ అంటున్నారు ఆమె.
శిక్షణ తీసుకున్నాను
ఎన్నో రోజులు ఆమె నిద్రలేని రాత్రులు గడిపారు. అనేక సందేహాలతో బాధపడేవారు. అయినా పట్టుదలతో ఉన్నారు. గృహిణిగా ఉండటం చాలా అవరమైన పని అని ఆమె అర్థం చేసుకున్నారు, అంగీకరించారు. అయితే ఆమె తనకు తానుగా వాస్తవంలో ఉండాలని, ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేయాలని కోరుకున్నారు. ”దీని కోసం నేను మేధోపరంగా ఎంతో నేర్చుకున్నాను. నా కుటుంబం కోసం చేసే పనులే కాకుండా నా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టాను. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమే కాదు నా సామర్థ్యాలకు న్యాయం చేయడం ముఖ్యం. అందుకే శిక్షణ పొందాను, నా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. ఏదో ఒక సమయంలో కుటుంబం మనకు అండగా ఉంటుంది’ అంటారు ఆమె.
సాంకేతికతకు దూరంగా లేదు
‘ప్రతి ఒక్కరూ తమకు సంతోషాన్ని కలిగించే విషయాలను గుర్తించడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక జీవితం ఉంటుంది. కుటుంబంలో నా పాత్ర కొంత వరకు పోషించాను కాబట్టి తిరిగి నేను పరిశ్రమకు రావాలని భావించాను’ అంటూ ఆమె జతచేస్తున్నారు. ఆమె తన ఏడేండ్ల విరామంలోనూ సాంకేతికతకు దూరంగా లేదు. టెక్ బ్లాగింగ్‌ను ఫ్రీలాన్సర్‌గా స్వీకరించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత గురించి రాయడం ప్రారంభించారు. ఈ రంగంలో ఏమి జరుగుతుందో తెలియజేసారు. సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్‌గా కూడా ఆమె మారారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌లో కూడా సహాయం చేశారు.
కుటుంబంలో మొదటి ఇంజనీర్
లూసెంట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సాంకేతిక నిపుణురాలిగా, డొమైన్, రిటైల్‌కు మారారు. ఇదే తన కెరీర్ పురోగతిని వేగవంతం చేస్తుందని ఆమె నమ్మారు. గాయత్రి 1998లో తమిళనాడులోని గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బి.ఇ పూర్తి చేశారు. ఆమె తన కుటుంబంలో మొదటి ఇంజనీర్. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి టెలికమ్యూనికేషన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్ కూడా చేశారు. ఆమె డి.ఇ షా ఇండియా సాఫ్ట్‌వేర్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. లూసెంట్‌లో సుదీర్ఘకాలం పని చేయడానికి ముందు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లో పని చేశారు.
మక్కువ చూపుతున్నారు
‘లూసెంట్‌లో మేము ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడంలో పని చేశాం. నేను రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్, సీడీఎంఏ డెవలప్‌మెంట్ గ్రూప్‌లో భాగమయ్యాను. పరిశోధన, అభివృద్ధిపై చాలా దృష్టి పెడుతున్నాను. వారి 50, 60 ఏండ్ల వయసులో ఉన్న వ్యక్తులతో ఇప్పటికీ పరిశోధన పట్ల మక్కువ చూపడం చాలా బాగుంది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. గాయత్రి 2020లో లోవ్స్ ఇండియాలో చేరారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సోర్సింగ్ (కస్టమర్ ప్రామిస్) ఇంజినీరింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది కస్టమర్‌లకు బ్రాండ్ నెరవేర్పు వాగ్దానాన్ని నెరవేర్చడానికి బాధ్యత వహిస్తుంది.
కారణాన్ని సమర్థించండి
‘చాలా మంది మహిళలు టెక్ రంగంలోకి వస్తున్నప్పటికీ నాయకత్వ స్థాయికి ఎదగలేకపోతున్నారు. ఇప్పటికీ మహిళలు ఇంట్లోని పిల్లలు, వృద్ధుల ప్రాథమిక సంరక్షకులుగా ఉండటమే దానికి కారణమని గాయత్రి అభిప్రాయపడ్డారు. ‘కుటుంబ అవసరాలు చూడాల్సి వచ్చినపుడు ప్రాధాన్యం, సమయ నిర్వహణ ప్రశ్న కూడా ఉంది. కొన్నిసార్లు ఒక దానితో ఒకటి పోటీ పడుతుం టాయి. కానీ మీరు ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలి. మనకి కెరీర్ ముఖ్యమైనది అయితే ఇతరులకు కుటుంబం ముఖ్యమైనది. అయితే మహిళలు అపరాధ భావన లేకుండా ఈ ఎంపికలను చేయగలగాలి. వారు కోరుకున్న దాని కోసం వాదించగలగాలి’ అంటారు ఆమె.
తిరిగి పనికి రావడానికి
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వైఫల్యానికి భయపడవద్దని గాయత్రి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అనుభవం నుండి ఆమె రిటర్న్‌షిప్‌ల ప్రాముఖ్యతను కూడా నమ్ముతున్నారు. ‘లోవ్స్ ఇండియాలో మేము తమ టెక్ కెరీర్‌లను పున:ప్రారంభించాలనుకునే మహిళల కోసం మా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయిన డూ-ఇట్-హెల్సెల్ఫ్ ప్రోగ్రామ్ ప్రారంభించాం.. కొన్ని కార్యక్రమాలు స్త్రీలు తమ ప్రసూతి సెలవు తర్వాత తిరిగి పనికి రావడానికి సహాయపడతాయి. అలాగే మహిళా నాయకుల కోసం లక్ష్య శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. కంపెనీ వైవిధ్యమైన, సమ్మిళిత వాతావరణాన్ని నిర్ధారించడానికి చాలా సమయం, వనరులు, కృషిని వెచ్చిస్తుంది. నా బృందంలో చాలా మంది మహిళా ఇంజనీర్లు ఉన్నారు. ఎల్లప్పుడూ వారి పరిధుల నుండి బయటికి రావడానికి, ఛాంపియన్‌గా ఉండేలా వారిని ప్రోత్సహిస్తాను. మన కోసం మనం మాట్లాడకపోతే మరెవరూ మన కోసం మాట్లాడతారని నేను అనుకోను’ అంటారామె.
సామాజిక సవాళ్లు
గాయత్రి తన మొదటి ఉద్యోగంలో ఏకైక మహిళా ఇంజనీర్. ఆమె కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అవకాశాల పరంగా ఇప్పటి మహిళల నట్ల వివక్ష కాస్త తగ్గిందని, అయితే పోరాటాల ఫలితంగానే ఇది సాధ్యమైందంటారు. ‘ఉద్యోగం డిమాండ్ చేస్తే ఇప్పటి లాగా 16-18 గంటలు పని చేయడం అప్పట్లో స్త్రీలకు అంత సులభం కాదు. వనరులు, ఇంటర్నెట్ యాక్సెస్ అంత సాధారణం కాదు. ఇప్పుడు కార్యాలయాల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా భారీగా ఉంది’ ఆమె చెప్పారు. లూసెంట్‌లో ఉన్నప్పుడు ఆమె హైదరాబాద్‌లోని బెల్ ల్యాబ్స్ ఇండియా ప్రొడక్ట్ రియలైజేషన్ సెంటర్‌లో భాగంగా టెలికామ్‌లో పని చేశారు.