– అయితే కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జేడీ(యూ)
పాట్నా : ఇండియా బ్లాక్‌తో ధృడంగా ఉన్నామని, అయితే భాగస్వామి పార్టీలు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ‘ఆత్మపరిశీలన’ చేసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) శుక్రవారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ సింగ్ కుస్వాహా ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలోకి జేడీ(యూ) తిరిగి వెళుతుందని పుకార్లు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఉమేష్ సింగ్ కుస్వాహా ఈ ప్రకటన విడుదల చేశారు. ‘బీహార్‌లో అధికారంలో ఉన్న మహా కూటమిలో అంతా బాగానే ఉంది. అయితే ఒక ఎజెండాలో భాగంగా మీడియాలో ఊహాగానాలు నడుస్తు న్నాయి’ అని మీడియా ప్రతినిధులతో కుస్వాహా అన్నారు. ‘నిన్నటి మాదిరిగానే ఈ రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసాను. అలాగే చక్కర్లు కొడుతున్న పుకారుల్లో ఎలాంటి నిజం లేదు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలను పాట్నాకు రమ్మని కోరినట్లుగా వచ్చిన పుకార్లను కూడా మేం తిరస్కరిస్తున్నాం’ అని కుస్వాహా తెలిపారు. శుక్రవారం రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దూరంగా, దూరంగా కూర్చోవడాన్ని కుస్వాహా తెలిగ్గా తీసుకున్నారు. ఇండియా బ్లాక్‌తో కలిసే ఉన్నామని అన్నారు. ‘అయితే వేదికలోని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు, సీట్ల సర్దుబాటుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు వీలుగా సీట్ల పంపకాల ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని మా నాయకులు నితీష్ కుమార్ చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు’ అని కుస్వాహా పేర్కొన్నారు. అలాగే, ఇండియా వేదికలో సీట్ల పంపకంలో జాప్యం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ ఎందుకు అడగరు?’ అని ప్రశ్నించారు.