– షాంఘై సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని మోడీ పిలుపు
– తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడంలో వెనుకాడరాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ : ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభమనేది పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే అనేక వివాదాలు, ఉద్రిక్తతలు, అంటువ్యాధులతో దేశాలన్నీ సతమతమవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమైక్యంగా కృషి జరగాల్సి వుందని మోడీ పేర్కొన్నారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వీడియో సమావేశాన్ని మంగళవారం ప్రారంభిస్తూ మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. కొన్ని దేశాలు తమ విధాన ఆయుధంగా సరిహద్దు ఆవలి తీవ్రవాదాన్ని ఉపయోగిస్తున్నాయని, అటువంటి వారిని విమర్శించడంలో ఎస్‌సిఓ వెనుకాడరాదని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వింటుండగానే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తీవ్రవాదమనేది ఒక ముప్పుగా మారిందని మోడీ పేర్కొన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చబడుతున్నాయని, ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారాన్ని విస్తరించాలని పిలుపిచ్చారు. ”ఏ రూపంలో నైనా లేదా ఏ వ్యక్తీకరణలోనైనా తీవ్రవాదం వుండొచ్చునని, ఆ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సి వుందని మోడీ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి భారత్ ఆందోళనలు, ఆకాంక్షలు చాలా ఎస్‌సిఓ దేశాల మాదిరిగానే వున్నాయని అన్నారు.
శాంతికి, అభివృద్ధికి కీలక వేదిక
యురేసియా అభివృద్ధికి, శాంతికి, సంక్షేమానికి కీలకమైన వేదికగా ఎస్‌సిఓ ఆవిర్భవించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతం (యురేసియా)తో భారత్‌కు గల వేలాది ఏళ్ల నాటి సాంస్కృతిక, ప్రజా సంబంధాలు మన భాగస్వామ్య వారసత్వానికి సజీవ సాక్ష్యంగా వున్నాయన్నారు. మన బహుముఖ సహకారాన్ని మరింత కొత్త ఎత్తులకు తీసుకెళ్ళేందుకు ఎస్‌సిఓ అధ్యక్షురాలిగా భారత్ నిలకడగా కృషి చేస్తుందని మోడీ చెప్పారు. ఎస్‌సిఓలో సంస్కరణలు తీసుకురావాలని, ఆధునీకరించాలన్న ప్రతిపాదనకు భారత్ మద్దతిస్తుందని చెప్పారు. ఇరాన్ కొత్త సభ్యురాలిగా ఎస్‌సిఓ కుటుంబంలోకి చేరుతున్నందుకు సంతోషంగా వుందన్నారు.
భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు సభ్య దేశాలుగా గల ఎస్‌సిఓ ప్రభావవంతమైన ఆర్థిక, భద్రతా విభాగంగా వుంది. అతిపెద్ద ప్రాంతీయ అంతర్జాతీయ సంస్థల్లో ఒకటిగా వుంది. గతేడాది సెప్టెంబరు 16న సమర్‌ఖండ్ సదస్సులో ఎస్‌సిఓ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ఎస్‌సిఓ సంస్థలైన సెక్రటేరియట్, ఎస్‌సిఓ రాట్స్ (ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక వ్యవస్థ) ల అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘భద్రత కలిగిన ఎస్‌సిఓ దిశగా’ అన్న అంశం ఈ సదస్సు ప్రధానాంశంగా వుంది.