– వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యవసాయ పరిశోధనా రంగంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) సహకారాన్ని ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వ్యవసాయ పరిశోధనలపై పరిశీలన చేస్తున్నారు. రాష్ట్ర రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. దీనికోసం భవిష్యత్ తరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్‌్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి యూఎస్‌డీఏ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల అమలును వివరించారు. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా, అన్ని కాలాల్లో పంటలు పండించడానికి అనువుగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాషింగ్టన్ డీసీలోనినేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్‌ఐఎఫ్‌ఏ)ను సందర్శించారు. అక్కడి డైరెక్టర్ మంజిత్ మిశ్రాతో భేటీ అయ్యారు. మంత్రితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎమ్‌డీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు ఉన్నారు.