మనకిప్పుడు మతాల్ని ప్రశ్నించే గొంతులు కావాలి!

కొన్ని పార్టీలు దేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు
సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు దేశానికి ప్రశ్నించే
గొంతుకలు కావాలి. కానీ, ప్రశ్నించే వారిని ఏ తప్పూ లేకపోయినా
ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఈ స్థితిలో దేశాన్ని
చూస్తూ ఉంటే భయమేస్తోంది.
– ఆమర్త్య సేన్‌, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ పురస్కార్‌ గ్రహీత.
ఇటీవల ఇండియా కూటమి పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎందుకూ? ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, పార్లమెంటుకు ముఖం చాటేసి, పారిపోయే దేశ ప్రధానిని పార్లమెంట్‌కు రప్పించి, మణిపూర్‌పై మాట్లాడించడానికి! అది విజయవంతమైంది. అంటే బీజేపీ ప్రతిభ తగ్గిందని అర్థం. కాంగ్రెస్‌ ముఖ్యనేత ఎంపీ.గా అనర్హుడని ఇంటికి పంపారు. కానీ ఆయన సుప్రీం కోర్టు ఆర్డర్‌తో పార్లమెంట్‌కు వచ్చి కూర్చున్నారు. అంతేకాదు, ‘రాహుల్‌ గాంధీ మాట్లాడాలి’ అని బీజేపీ ఎంపీలతోనే బతిమిలాడించుకున్నాడు – అంటే ఏమిటీ? కాంగ్రెస్‌ ప్రభ తగ్గినట్టా బీజేపీ ప్రభ తగ్గినట్టా? ఇండియా కూటమి ప్రభ తగ్గినట్టా. ”మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు. మీ కుట్రలు, కుతంత్రాలతో మణిపూర్‌ను రెండుగా చీల్చారు” అని కాంగ్రెస్‌ నేత ఆక్రోశిస్తూ చెప్పిన మాటల్లోని ఆవేదన ఈ దేశ ప్రజల మనసుల్లో తిష్టవేసింది. బీజేపీ మంత్రులు, హౌమ్‌మంత్రి, దేశ ప్రధాని గంటల తరబడి చెప్పిన అసందర్భపు మాటలు, తక్కువ స్థాయి హాస్యోక్తులు ఇండియా కూటమి సభ్యులు వినదల్చుకోలేదు. అందుకే వాకౌట్‌ చేశారు. ప్రతిపక్షాల ఐక్యత మనకు అక్కడ కనిపించింది. పనికిరాని విషయాన్ని రాద్ధాంతం చేసిన బీజేపీ మహిళా మంత్రుల మాటలు గానీ, దేశ ప్రధాని ఇండియా కూటమిపై పేల్చిన జోకులు గానీ వారి స్థాయిని నిలుపలేకపోయాయి. పైగా కనపడని అగాధంలోకి పడదోశాయి.
నిర్భయ అనే ఒక మహిళని సామూహికంగా అత్యాచారం చేసినందుకు నిరసనగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దేశ ప్రధానికి గాజులు పంపింది ఒక విపక్ష సభ్యురాలు! ఆమె ఇప్పుడు మంత్రిగా అధికారంలో ఉంది. మరి ఇప్పుడు తమ స్వంత ప్రధానికి ఒక గాజుల దుకాణమే పంపాలి కదా? ఎందుకంటే మణిపూర్‌లో ఇప్పుడు ఒక్క మహిళ కాదు, అనేక వందల మంది మహిళలు సామూహిక అత్యాచారాలకు గురయ్యారు. మహిళల్ని నగంగా వీధుల్లో ఊరేగించారు. ఈ విషయాలు స్వయంగా మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించారు. అధికారంలో ఉన్న బీజేపీ మహిళా మంత్రులకు ఈ విషయాలు కనబడలేదు. కనీసం నిరసన – ఒక సానుభూతి ప్రకటన కూడా లేదు. నిర్భయ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం అడ్డుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్ర – కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు ఇంటర్‌నెట్‌ సేవలు ఆపేసి విషయాలు బయటి ప్రపంచానికి తెలియకుండా చేశాయి. అధికారంలో ఉన్న మహిళా మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్టూ? మహిళల పక్షాన గొంతెత్తరా? మానవీయ విలువల్ని తొక్కిపెట్టే రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా? అసలు వీరికి నైతికత ఏదీ?
అర్థనగంగా ఓ మహిళ – పోలీసుల మీద తిరగబడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో మీడియాలో తిరిగింది. ”మణిపూర్‌ పోలీసుల మీద కుకీ మహిళ దాడి చేస్తున్నట్లు – కాషాయ వర్గాలు దాన్ని వక్రీకరించి విష ప్రచారం ప్రారంభించాయి. అది వాస్తవం కాదు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్‌ చందౌలీ లోని పండిట్‌ దీన్‌ దయాళ్‌ నగర్‌లో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంలో జరిగిన సంఘటన – ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్‌ చేస్తూ సోనూ కిన్నార్‌ అనే స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు కౌంటింగ్‌ కేంద్రం వెలుపల గుమిగూడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు – అది అప్పటి వీడియో. దానికీ మణిపూర్‌ కుకీ మహిళలకీ సంబంధమే లేదు. అధికారంలో ఉన్నవారు అబద్దాల ప్రచారానికి 3వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో ఒక ఐటీ సెల్‌ నడుపుతున్నారు. అది చేసే పని ఇదే. రోజుకు లక్షల మందికి తప్పుడు సందేశాలు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు పంపడమే వీరి విధి. ఏ ప్రధాని ఉన్నప్పుడైనా నా బోటి సామాన్యుడికి పి.యం.ఓ. (ఫ్రైమ్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌) నుండి ఈమెయిల్స్‌ వచ్చేవి కావు. ఇప్పుడు మాత్రం నెలకు 3, 4 వస్తూనే ఉంటాయి. మెయిల్‌ బాక్స్‌ నిండిపోకుండా, డిలిట్‌ చేసుకోవడం అదనంగా మనకు పనిభారం! మణిపూర్‌ ఘటనలో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ ఖాన్‌ అరెస్టయ్యాడని అబద్దాల ఐటీ సెల్‌ ప్రచారం చేసింది. అసలు నిందితుడు హేరురిమ్‌ హిరోదాస్‌ మెయితీ. అసలు పేరు దాచిపెట్టి, తప్పు ముస్లింలపైకి తోసెయ్యడానికి ప్రయత్నం జరిగిందని తెలిసిపోయింది.
”ప్రధాని మోడీ మమ్మల్ని ఏ విధంగా పిలిచినా, ఏ విధంగా గేలి చేసినా మేము – ‘ఇండియా’నే. మణిపూర్‌ గాయాలు మాన్పడానికి మేం సహాయ పడతాం. మణిపూర్‌ మహిళల, చిన్నారుల కన్నీళ్ళు తుడుస్తాం. మేం మణిపూర్‌ ప్రజల జీవితంలో ప్రేమను, శాంతిని తిరిగి తీసుకొస్తాం!” అని అన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇండియా కూటమి పక్షాన – ఈ దేశంలోని సామాన్యులు దేశ నాయకులందరినీ గమనిస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు. మణిపూర్‌ తగలబడుతోందన్న బాధలేకుండా, అధికారంలో ఉండి, తక్షణం చేపట్టాల్సిన చర్యలు చేపట్టకుండా విపక్షాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి కాదు గదా ఈ దేశ ప్రజలు బీజేపీకి అధికారమిచ్చిందీ? ఎవరు అధికారమిచ్చారో వారే సమయం చూసి మళ్ళీ లాగేసుకుంటారు. బలం ఉందన్న అహంకారం అన్ని వేళలా, అన్ని చోట్లా పనిచేయదు. ”ప్రజల చైతన్యంలో మనం నాటిన విత్తనాలు మొలకెత్తకుండా ఎల్లకాలం ఉండబోవు. సామాజిక కార్యక్రమాన్ని శత్రువులు నేరాలతోనూ బలప్రయోగంతోనూ అణిచివేయలేరు. ప్రజలే చరిత్ర నిర్మాతలు” అని అన్నారు సాల్వడార్‌ అలెండీ. అమెరికా కుట్రదారులకు బలైన చిలీ అధ్యక్షుడు – కమ్యూనిస్టు నేత.
దేశకాల పరిస్థితుల్ని సునిశితంగా పరిశీలించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌ ట్విట్టర్‌లో ఇలా రాశారు… అందులోని నిజానిజాల్ని మనం కూడాబేరీజు వేసుకోవాలి. మేధావి, పరిపాలనాదక్షుడైన ఆయన ఆలోచనల్ని, ఆవేదనల్ని ఈ దేశ ప్రజలు తప్పక అర్థం చేసుకోవాలి. ఆలోచించాలి.
******
భారతదేశం రకరకాల పూలతో అల్లిన పూలమాల! కానీ, అది ప్రస్థుతం ఒక కోతి చేతికి చిక్కింది. నేను కాంగ్రెస్‌ వాడినో, కమ్యూనిస్టునో, మోడీ భక్తుణ్ణో కాదు. నా భారతదేశాన్ని ప్రేమించే ఒక సాధారణ పౌరుణ్ణి! గత 70 ఏండ్లుగా కుల మతాలకు అతీతంగా దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అందుకు భారత ప్రధానులందరూ అహౌరాత్రులు శ్రమించారు. ఫలితంగా నేడు మనదేశం ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదిగింది. ఇక్కడ కొన్ని వాస్తవాల్ని విశ్లేషించుకుందాం!
మోడీ పుట్టక ముందే పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది.
డీకి మాటలు రాకముందే ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి సమకూరింది.
మోడీ బాజ్రా, కోలం వంటి ఆటలు ఆడే నాటికి భారతదేశం భాక్రానంగల్‌ నిర్మించుకుంది.
మోడీ అక్షరాలు రాయడం నేర్చుకోకముందే ఇక్కడAIIMS / IIT ఇంకా అనేక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.
మోడీ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకుని బతికే నాటికి ఇక్కడ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లాంటి వేగంగా నడిచే రైళ్ళు పరిగెత్తాయి.
ఈ దేశానికి ఎన్ని ప్రయోజనాలు సమకూరాయో అన్ని ప్రయోజనాలు మోడీ గుజరాత్‌ సీఎం కాకముందే సమకూరాయి.
మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అన్నీ సమకూరాయనీ, అదంతా ఆయన పరిపాలనా దక్షత అని కొందరు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా వారు నమ్మినా, నమ్మకపోయినా జనాన్ని పిచ్చివాళ్ళను చేయడానికి నిసిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మోడీ ప్రధాని అయిన నాలుగేళ్ళలో దేశాన్ని నలభై యేండ్లు వెనక్కి నడిపించారు. కుల, మత రహిత సామరస్య భావనతో ఉన్న భారత దేశాన్ని మోడీ తన మతతత్వంతో ముక్కలు చేసే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో మన పూర్వీకులు అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు భవిష్యత్తులో మన పిల్లలు కూడా అనుభవించాలని మనం కోరుకుంటున్నాం! అంతే-
డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలలో నిజం ఉందా లేదా? నిజాయితీ ఉందా లేదా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. బాధ్యత, విజ్ఞత గల పౌరులు తప్పకుండా డాక్టర్‌ రాజన్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. సందేహం లేదు.
సనాతన ధర్మం అనగానే మనువాదులంతా ఉలిక్కిపడుతుంటారు. తమ మనోభావాలకు దెబ్బలు తగిలించుకుంటారు. అసలైతే, ఈ దేశంలో సనాతన ధర్మాలు బౌద్ధ జైన ధర్మాలే అన్న విషయం కప్పిపుచ్చుతుంటారు. పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత చాలా కాలానికి రాయబడ్డాయన్న నిజం ఒప్పుకోవాలి! అయినా, నేటి మనువాదుల ప్రకారం సనాతన ధర్మం, హిందుత్వ అంటే ఏమిటీ? ఆవుమూత్రం తాగి, ఆవుపేడ తిని, గోప్రదక్షిణలు చేయడమే కదా? అంతకన్నా ఎక్కువ వారికి అర్థమయిందీ లేదు. జనానికి అర్థం చేయించిందీలేదు. రాజకీయ దురుద్దేశాలతో ఈ రాజకీయ నాయకులు ‘సమధర్మో సమభావో’ అని చిలుక పలుకులు పలుకుతుంటారు. ”సనాతన ధర్మం-క్రమశిక్షణ గల ధర్మం” అని చెప్పుకునే వారు గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు క్రమశిక్షణతోనే చేయించారా? మన చంద్రయాన్‌-3 లక్షల కి.మీ. ప్రయాణించి విజయవంతంగా చంద్రుణ్ణి చేరింది పాపం! ఈ దేశ ప్రధాని మాత్రం ఢిల్లీ నుండి మణిపూర్‌ చేరుకోలేక విఫలమయ్యాడు. ”మతాలన్నీ అంటువ్యాధుల వంటివి, వాటిని అరికట్టాలన్న” తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ గొంతుకు దేశంలో మద్దతు పెరిగింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లాక్కుని ప్రజల్ని విడదీసే మతాలన్నింటినీ ఆయన అన్నట్టు… త్యజించా ల్సిందే! మనుషులందరిదీ ఒక్కటే స్థాయి అని నిరూపించిన జన్యుశాస్త్రాన్ని ఒప్పుకున్న ధర్మమే నిజమైన ధర్మం!! ఉట్టి స్వాతంత్య్రమే కాదు, దానితో పాటు, ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ అవసరం! ప్రజాస్వామ్యం కూడా అవసరం! అందుకు నిత్య చైతన్యవంతంగా ప్రజా పోరాటాలు ఇంకా కొనసాగించాల్సే ఉంది. ఇంకా కొన్ని సాధించుకోవాల్సే ఉంది.
– వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.