ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ను సకాలంలో ఛేదించాం

 డీజీపీ కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి
అమరావతి: విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో పోలీసులు సకాలంలో స్పందించి కిడ్నాప్‌కు గరైనవారిని విడిపించినట్టు డీజీపీ కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కిడ్నాప్‌ ఘటనను రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని, పోలీస్‌శాఖ అప్రమత్తంగా వుండటం వల్లనే గంటల వ్యవధిలో ఈ కేసును ఛేదించగలిగామని అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం జ్యోతి, ఆమె కుమారుడు శరత్‌, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదును వసూలు చేశారని తెలిపారు. కిడ్నాపర్‌లను అరెస్టు చేశాక, వారి నుంచి ఇప్పటివరకు రూ 86.5 లక్షలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు హేమంత్‌, రాజేష్‌, సాయి కలిసి ఎంపీ కుమారుడు శరత్‌ ఇంటికి వెళ్లి నిర్బంధించి ఇంట్లో వున్న రూ.15 లక్షలు తీసుకుని, బ్యాంకు ఖాతా నుంచి మరో రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత శరత్‌ ద్వారానే తల్లి జ్యోతిని, ఆడిటర్‌ వెంకటేశ్వరరావును రప్పించి కోటి రూపాయలను రాబట్టారన్నారు. మొత్తం రూ1.75 కోట్లను తీసుకున్నారని డీజీపీ తెలిపారు. డబ్బు కోసమే నిందితులు ఈ కిడ్నాప్‌ చేశారన్నారు. కిడ్నాప్‌ సమాచారం అందగానే పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొదట కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే వారిని వెంబడించారు. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్‌ను తీసుకుని వారు కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారని తెలిపారు. పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు మరమ్మతుకు గురవ్వడంతో కిడ్నాప్‌ చేసిన ముగ్గుర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారని డిజిపి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగేండ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోవడమే కాదు.. వారి నుంచి రూ.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హేమంత్‌కు నేర చరిత్ర వుందని తెలిపారు. కిడ్నాపర్లు కట్టేసి కొట్టడంతోపాటు కత్తి చూపి చంపుతామని బెదిరించారని, నిందితులపై పిడి యాక్టును ప్రయోగిస్తున్నట్లు తెలిపారు.