– టీటీడీపీ అధ్యక్షులు కాసాని
– ఒంటరిగానే పోటీ
– లోకేష్‌తో చర్చించాకే సంఖ్య తేలుస్తామని వ్యాఖ్య
– చంద్రబాబుకు పరామర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు నాదృష్టిలో లేదనీ, ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో చర్చించాకే ఎన్నిస్థానాల్లో పోటీచేయాలనేది నిర్ణయిస్తామని వివరించారు.
శనివారం చంద్రబాబును పరామర్శించేందుకుగాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ములాఖాత్‌లో భాగంగా ఆయన బాబును కలిశారు. తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులు, పొత్తులు, ఇతర అంశాలపై బాబుతో చర్చించారు. పోటీ చేసేందుకు చంద్రబాబు సైతం అంగీకరించినట్టు కాసాని చెప్పారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ? ఎక్కడెక్కడ చేయాలి ? తదితర అంశాలకు సంబంధించి లోకేశ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు, కాసానికి సూచించారు. ఈనేపథ్యంలో ములాఖాత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని అన్నీ స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నామన్నారు.
తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందన్నారు. నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు, నేను ఏ ఏపార్టీతోనూ చర్చించలేదని చెప్పారు. అవన్నీ మీడియా సృష్టి మాత్రమేనని అన్నారు. నాదృష్టిలో టీడీపీనే బెస్ట్ పార్టీ అనీ, చంద్రబాబే బెస్ట్ లీడర్ అని వ్యాఖ్యానించారు. ఆదివారం లోకేశ్‌తో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత పోటీ చేసే స్థానాలు, సంఖ్య ఖరారవుతుందని తెలియజేశారు.