జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తాం..

– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. బుదవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తూన్న సమ్మె శిబిరానికి ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50వేల మందికిపైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని, వీరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ కపట ప్రేమను పోషిస్తూ పంచాయతీ కార్మికులచే వెట్టి చాకిరి చేయిస్తూ వారి శ్రమను దోస్తునారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దేవుళ్ళుగా కొలుస్తూ వాళ్ళ కాళ్ళని కడుగుతూ కపట ప్రేమని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు  సరైన గుర్తింపు లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది అందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలను పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని,మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఒకవేళ కార్మికుడు మరణిస్తే మట్టి ఖర్చుల కింద కనీసం 30 వేల రూపాయలు దహన సంస్కారాలకు అందించాలని అన్నారు.ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 20 లక్షలు నష్ట పరిహారం అందించాలని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని పంచాయితీ కార్మికులకు దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇకనైనా కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మురళి, కిషన్, వెంకన్న, సాయ గౌడ్, కిషన్, మోహన్, కార్మికులు ముత్తన్న, గంగాధర్, భూమయ్య, రవి, రాజేందర్, అశోక్, దుర్గా, సుజాత తదితరులు  పాల్గొన్నారు.