సమాజంలోని వివక్షను ఎదిరించి ఓ యక్షగాన కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కళారూపాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయురాలిగా మారారు. సాంప్రదాయక కళారూపాన్ని రక్షించేందుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనం నుండి తాను నేర్చుకున్న కళను బతికించుకునేందుకు, మరింత భిన్నంగా ప్రపంచానికి చూపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఆమే ప్రముఖ యక్షగాన కళాకారిణి ప్రియాంక కె మోహన్. యక్షగానాన్ని స్వయంగా ప్రదర్శిస్తూ.. నేర్పించే అతికొద్ది మంది మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
బెంగుళూరులో పెరిగిన ప్రియాంక చిన్నప్పటి నుండి యక్షగాన లోకంలోనే పెరిగారు. ఎందుకంటే ఆమె ఇల్లు యక్షగాన కళాకారులకు కేంద్రం. తండ్రి కె మోహన్, దక్షిణ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సాలిగ్రామ నుండి 1970ల ప్రారంభంలో బెంగుళూరుకు మారారు. అప్పటికే ఈ ప్రాంతంలో యక్షగానం వేళ్లూనుకుని ప్రజాదరణ పొందుతుంది. సాంప్రదాయ నృత్యం, నాటకం నృత్యం, సంగీతం, పాట, సంభాషణలు, రంగురంగుల దుస్తులతో ఆ ప్రాంతం కళకళలాడేది.
కళల్లో శిక్షణ ఇచ్చేందుకు
కె మోహన్ అప్పట్లో యక్షగాన ఔత్సాహికుడు. కళారూపాన్ని ప్రోత్సహించిన కుటుంబం నుండి వచ్చినవారు. టౌన్ హాల్, రవీంద్ర కళాక్షేత్రతో పాటు బెంగుళూరు నగరంలోని ఇతర సాంస్కృతిక కేంద్రాలలో ప్రదర్శనలు ఇవ్వడానికి దక్షిణ కన్నడ నుండి కళాకారులను తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించేవారు. 1981లో యక్షగానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు విద్యార్థులకు కళల్లో శిక్షణ ఇచ్చేందుకు యక్షదేగుల అనే సంస్థను అధికారికంగా నమోదు చేశారు. ‘మా రెండు పడకల ఇంటిలో అనునిత్యం 20-30 మంది కళాకారులు ఉండేవారు. మా అమ్మా, అమ్మమ్మ వాళ్ళకి వండి పెట్టేవారు. ఇలా నేను కళాకారుల మధ్యలో పెరిగాను’ అంటూ ప్రియూంక ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
నిరుత్సాహపరిచారు…
ప్రియాంకకు కేవలం ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడు కె.మోహన్ తన కుమార్తెలిద్దరికీ కళారూపాన్ని నేర్పించాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పట్లో యక్షగానం అంటే కేవలం మగవారు మాత్రమే ప్రదర్శించేవారు. దాంతో చాలా మంది అతన్ని నిరుత్సాహపరిచారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. యక్షగానాన్ని ఏదో ఒక విధంగా తన కూతుళ్లు ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ‘నేను, నా చెల్లెలు నేర్చుకోవడం ప్రారంభించాము. తక్కువ కాలంలోనే ఇరుగుపొరుగు నుండి ఇతర పిల్లలు కూడా చేరారు. 25 ఏండ్లుగా మా నాన్న స్థాపించిన ఈ సంస్థలో ఎవరి దగ్గర రుసుము వసూలు చేయలేదు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. అక్కచెల్లెళ్లు ఇద్దరూ పాఠశాల చదువు పూర్తి చేసే సమయానికి సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిరోజు పాఠశాల తర్వాత తరగతులు, రిహార్సల్స్, ఆపై ప్రదర్శనలు ఉండేవి.
యవ్వనంలో సమస్యలు
యుక్త వయసుకు వచ్చిన తర్వాత ప్రియాంక అనేక అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఆమె అభ్యాసం కూడా అంత సులభం కాలేదు. ప్రదర్శనల్లో పాల్గొనడానికి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేవి. దాంతో ఆమె చదువుపై దృష్టి పెట్టారు. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విరామం ఇచ్చారు. కానీ ఆ విరామం కూడా విజయానికి దారితీసింది. ‘నేను కళకు విలువ ఇవ్వడం, కళను వేరే దృష్టితో చూడటం ఆ సమయంలోనే ప్రారంభించాను. ఈ కళ గురించి మరింత తెలుసుకోవాలని, అన్వేషించాలనే కోరిక కలిగింది’ అంటూ ఆమె పంచుకున్నారు. ఇంటర్ చదువుతున్న రెండేండ్లలో సంస్థలోని పాత ఆర్టిస్టులలో ఒకరు ఆమెను బోధన ప్రారంభించమని అడిగారు. మొదట ఆమె నమ్మలేకపోయారు. కళాకారురాలిగా తనను తాను నిరూపించుకోవడం చాలా కష్టం. కానీ బోధన పూర్తిగా దీనికి భిన్నమైన ప్రపంచం. ఇలా సందేహాలు ఉన్నప్పటికీ ఆమె కేవలం 19 ఏండ్ల వయసులో 2008లో యక్షగానం నేర్పడం ప్రారంభించారు.
అంగీకరించేందుకు సమయం పట్టింది
నేర్పడం అనేది కళ, విద్య పట్ల ఆమెకున్న మక్కువను మరింత ముందుకు తీసుకువెళ్లింది. క్లాస్‌రూమ్‌లో రెండింటినీ ఏకీకృతం చేయడానికి ఆమె టీచ్ ఫర్ ఇండియాలో చేరారు. ఇప్పటి వరకు ప్రియాంక యక్షగానంలో 2,000 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఈ రంగంలో ఉన్న అతికొద్ది మంది మహిళా గురువులలో ఆమె ఒకరు. ఒక మహిళను గురువుగా ప్రజలు అంగీకరించడానికి కొంత సమయం పట్టిందని, అయితే తన తండ్రి కారణంగా తన ప్రయాణం సులభమైందని ఆమె పంచుకున్నారు. ‘ఒక మహిళగా తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి. పూర్వరంగానికి, యక్షగానంలోని ఇతర అంశాలకు కొత్త కోణాన్ని అందించిన 50-60 మంది పిల్లలతో నేను ఒక ప్రదర్శనను నిర్వహించడంతో నా ప్రయాణం ఓ మలుపు తిరిగింది. దీని తర్వాత కళాకారుల సంఘంలో నా పట్ల ఓ మంచి మార్పును నేను చూశాను’ అని ఆమె వివరించారు. కళాకారిణిగా ఆమె సుభద్ర, ద్రోణ, అభిమన్యుతో పాటు అనేక పురుష, స్త్రీ పాత్రలను ప్రదర్శించారు. ప్రియాంక హాస్య పాత్రలను ఇష్టపడతారు. ఎందుకంటే అవి వేదికపై ఆమెలోని భిన్నమైన భాగాన్ని తీసుకువస్తాయి.
హద్దులు ఉల్లంఘించకుండా…
‘యక్షగానం చెడుపై మంచి అనే సందేశాన్ని కలిగి ఉంది. దేవాలయాలలో కళారూపాన్ని ప్రదర్శించినప్పుడు ఆచారబద్ధంగా, కొన్ని ప్రక్రియలను అనుసరిస్తుంది. ఒక స్త్రీ మేళాలో భాగం కావడం నిషిద్ధం. అయితే ఆచారాలకు వెలుపల చాలా ఆవిష్కరణలు వచ్చాయి. కోవిడ్‌కు ముందు సామాజిక కారణాల గురించి మాట్లాడటానికి యక్షగానాన్ని ఉపయోగించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింద యక్షదేగుల ఎంప్యానెల్ చేయబడింది. హెచ్1ఎన్1 విజృంభించినప్పుడు గ్రామాలను సందర్శించి వాటి గురించి మాట్లాడుకునేవాళ్లం. జీఎస్టీ గురించి మాట్లాడేందుకు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ మమ్మల్ని సంప్రదించింది. యక్షగానాన్ని ఆవిష్కరిం చిన తొలితరం వ్యక్తుల్లో మా నాన్న ఒకరు’ అని ప్రియాంక పంచుకున్నారు.
భిన్నమైన కళారూపాల కోసం…
కళారూపానికి సంబంధించిన హద్దులు, సాంప్రదాయాలు బద్దలు కొట్టకూడదని ప్రియాంక భావిస్తున్నారు. ‘మేము ఈ కళారూపాలను మరింత సందర్భోచితంగా, ఆకాంక్షించేలా ఎలా చేయాలి అనే దానిపై దృష్టిపెట్టాము’ అని ఆమె అంటున్నారు. యక్షదేగుల భారతదేశం, విదేశాలలో 7,000 ప్రదర్శనలను ప్రదర్శించినప్పటికీ ప్రతిసారీ నిర్వాహకులు రుసుముపై చర్చలు జరుపుతున్నారని ఆమె చెప్పారు. అయితే కాంతారా సినిమా విడుదల యక్షగాన కళాకారులకు ప్రాధాన్యం పెరిగిందేకు సహాయపడింది. కేవలం యక్షగానమే కాకుండా ప్రస్తుత తరానికి మరింత సందర్భోచితంగా ఉండేలా విభిన్నమైన కళారూపాలను రూపొందించేందుకు ప్రియాంక సామాజిక సంస్థలో తన ఉద్యోగానికి స్వస్తి చెప్పారు.