
– ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ రావు
నవతెలంగాణ పెద్దవంగర: రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి ‘ఆరోగ్యం శ్రీ’ తో భరోసా కల్పిస్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు అన్నారు. ఇటీవల ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా సుధాకర్ రావు స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల పరిధిలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సుధాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ‘ఆరోగ్య శ్రీ’ తో కార్పొరేట్ వైద్యానికి దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ సేవలు బేష్ అని, దేశానికే ఆరోగ్య శ్రీ సేవలు ఆదర్శంగా నిలిచాయన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ‘ఆరోగ్య శ్రీ’ సేవలు 24 గంటల్లో క్లియరెన్స్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, ఉపసర్పంచ్ కొమ్మాల శ్రీనివాస్, కేశబోయిన కుమారస్వామి, బొల్లు ఉషయ్య, కూకట్ల వీరన్న, శ్రీనివాస్, బొల్లు గణేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.