ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తాం

On classification of sc We will form a committee– ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది
– త్వరలోనే సమస్యకు ముగింపు పలుకుతాం
– మంద కృష్ణ మాదిగ పోరాటం వెనుక నేనుంటా
– మాదిగ విరోధులుగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు
– ఎమ్‌ఆర్‌పీఎస్‌ బహిరంగ సభలో ప్రధాని మోడీ
– మందకృష్ణను ఆలింగనం చేసుకున్న పీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఎస్సీ వర్గీకరణ న్యాయపరమైన ప్రకియ. అది సుప్రీం కోర్టులో ఉంది. తర్వలోనే ఒక కమిటీ వేస్తాం. మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి త్వరలోనే ముగింపు పలుకుతాం. న్యాయం వైపు నిలబడుతానని హామీనిస్తున్నా. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉంది. నా హామీ నచ్చితే మొబైల్‌ లైట్‌ వేసి మద్దతు తెలపండి. నాకు ఆశీర్వాదం ఇవ్వండి. మందకృష్ణ నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో ఆయన వెనుకే నేనుంటా’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప సభను నిర్వహించారు. మందకృష్ణమాదిగను మోడీ ఆలింగనం చేసుకున్నారు. ఆయన భుజం తట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. మందకృష్ణ ఏడ్చేశారు. సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మోడీ మాట్లాడుతూ..తెలంగాణకొచ్చిన ప్రతిసారీ సొంత కుటుంబ సభ్యులను కలిసినంత సంతోషం కలుగుతున్నదన్నారు. గుర్రం జాషువా దళిత జాతి సమస్యను విశ్వనాథుడికి మొరపెట్టుకున్న వారణాసి నుంచి తాను రావడం సంతోషంగా ఉందన్నారు. మాదిగలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. స్వాతంత్య్రానంతరం ఆయా పార్టీలు ఎన్నో హామీలను ఇచ్చి మాటతప్పాయని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. అలాంటి రాష్ట్రం నేడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు వల్ల సంకట స్థితిలో ఉందని చెప్పారు. దళిత సీఎం, మూడెకరాల హామీలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. దళిత బంధు పథకం వల్ల ఎమ్మెల్యేలకే లాభం జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం స్కీమ్‌లు స్కాంలుగా మారాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులనీ, ఆ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంబేద్కర్‌ రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదనీ, పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఆయన ఫొటో పెట్టలేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ అంబేద్కర్‌ను కేసీఆర్‌ అగౌరవపరిచారన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపదిముర్ములను రాష్ట్రపతులుగా చేస్తే కాంగ్రెస్‌ పార్టీ అగౌరవపరిచిందన్నారు. తమ ప్రభుత్వం సమాచార కమిషన్‌ చీఫ్‌గా దళితున్ని నియమిస్తే కాంగ్రెస్‌ వ్యతిరేకించిందన్నారు. బీహార్‌లో రామ్‌ విలాస్‌ పాశ్వాస్‌కు రాజ్యసభ సీటు ఇస్తే నితీశ్‌కుమార్‌ వ్యతిరేకించారనీ, మాజీ సీఎం మాంఝీని అగౌరవపర్చారని చెప్పారు. ఆ పార్టీల నేతలు దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనన్నారు. ఢిల్లీలోని ఆప్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు లిక్కర్‌ స్కామ్‌లో ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అవినీతికి ఆనవాళ్లు అనీ, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పేద ప్రజల బాధలు తెలిసిన వ్యక్తిగా గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకాన్ని కరోనా కాలంలో తీసుకొచ్చామని తెలి పారు. వచ్చే ఐదేండ్ల పాటు పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామనీ, ఈ ఏడాదీ కొంటామని చెప్పారు. బాయిల్డ్‌ రైస్‌ను కూడా కొన్న విషయాన్ని ప్రస్తావించారు. బంగారు లక్ష్మణ్‌ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన రాజకీయ గురువు అని చెప్పారు. ఒకే జీవితం..ఒకే లక్ష్యం నినాదంతో ముందుకెళ్తున్న మంద కృష్ణ పోరాటంలో కలిసి నడుస్తానని చెప్పారు.
ఎస్సీ ఉపకులాల సభకు ప్రధాని రావడం సంతోషకరం : మంద కృష్ణ మాదిగ
ఎస్సీ ఉపకులాల సభకు ప్రధానమంత్రి మోడీ రావడం సంతోషకరమని ఎమ్‌ఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. పశువుల కన్నా హీనంగా, అంటరానివారిగా తమను సమాజం చూసిందని వాపోయారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తామని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాటలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. దళిత, గిరిజన సామాజిక తరగతి వారిని రాష్ట్రపతులుగా చేస్తే ఓర్వలేని పార్టీలన్నారు. ఆ రెండు పార్టీలకు భిన్నంగా మోడీ పెద్దన్న పాత్రలో దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ క్యాబినెట్‌లోని 18 మంత్రుల్లో మాదిగ సామాజిక తరగతికి చెందిన ఒక్క మంత్రి కూడా లేరని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 11 మంది దళిత ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేసిందని కొనియాడారు. దేశంలోనే బలమైన నేత అయిన మోడీ ప్రజల విశ్వాసాన్ని పొందారని చెప్పారు.
బెదిరింపులు, ఆటుపోట్లకు వెనక్కి తగ్గని వ్యక్తి మందకృష్ణ: కిషన్‌రెడ్డి
బెదిరింపులు, ఆటుపోట్లకు అస్సలు భయపడకుండా ఎమ్‌ఆర్‌పీఎస్‌ ఉద్యమాన్ని 30 ఏండ్ల నుంచి క్రమశిక్షణా పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పేదకుటుంబం నుంచి వచ్చి ప్రపంచ నేతగా ఎదిగిన ప్రధాని మోడీ ఈ సభకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మురుగన్‌, నారాయణస్వామి, ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్‌, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎమ్‌ఆర్‌పీఎస్‌ నేతలు పాల్గొన్నారు.