రూ.1,000 నోట్లను ప్రవేశపెట్టబోం

– రూ.50వేల పైన డిపాజిట్లకు పాన్‌ తప్పనిసరి
-ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడి
న్యూఢిల్లీ : రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. వెయ్యి నోటును మళ్లీ తెస్తున్నారనేది ఊహాగానాలేనని అన్నారు. రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి సోమవారం శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడారు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందన్నారు. ఆ నిబంధన ప్రస్తుతం రూ.2,000 నోట్ల డిపాజిట్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నగదును ఇవ్వడానికి బ్యాంక్‌ల వద్ద సరిపడ మూల్యం అందుబాటులో ఉందన్నారు. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని దాస్‌ పేర్కొన్నారు. కరెన్సీ నిర్వహణలో భాగంగానే పెద్ద నోటును రద్దు చేశామన్నారు. క్లీన్‌ నోట్‌ పాలసీని ఆర్‌బీఐ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నదన్నారు. వివిధ విలువ చేసే నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్‌బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందన్నారు. ఆ స్థానంలో కొత్త సిరీస్‌లను కూడా విడుదల చేస్తుందన్నారు. అదే విధంగా రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్టు తెలిపారు.
గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను ఎదుర్కోవడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టామని శక్తికాంత దాస్‌ అన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడంతో ఉపసంహరించుకుంటున్నామన్నారు. సెప్టెంబర్‌ 30 వరకూ రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయవచ్చన్నారు. నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇచ్చామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని శక్తికాంత దాస్‌ అన్నారు. పెద్ద మొత్తంలో చేసే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందన్నారు. ఆ అంశంలో బ్యాంక్‌లకు కచ్చితమైన కొన్ని నిబంధనలు ఉన్నాయన్నారు. నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై నియంత్రణ కొనసాగుతుందన్నారు. రూ.2వేల నోట్ల డిపాజిట్లు చేయడానికి, మార్పిడి కోసం వచ్చే ప్రజలకు నీడ, మంచినీటి వసతి కల్పించాలని బ్యాంక్‌లకు ఆర్‌బిఐ సూచించిందన్నారు.
70 శాతం వాటా రూ.500 నోట్లదే..
భారత్‌లో ప్రస్తుత నగదు చలామణీలో 70 శాతం వాటా రూ.500 నోట్లదేనని ఆర్‌బీఐ గణంకాలు వెల్లడించాయి. 2016 నోట్ల రద్దు ముందు ఈ కరెన్సీ వాటా 20 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2021-22 ముగింపు నాటికి రూ.2,000 నోట్ల వాటా 13.8 శాతంగా ఉంది. 2023 మార్చి నాటికి 10.8 శాతం వాటా కలిగి ఉంది.
జన్‌ధన్‌ ఖాతాలపై నిఘా..
జన్‌ధన్‌ ఖాతాల్లో భారీగా డిపాజిట్‌ అయ్యే రూ.2,000 నోట్లపైనా ఆర్‌బీఐ నిఘా పెట్టిందని ఓ అధికారి తెలిపారు. అనుమానిత ఖాతాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిపై బ్యాంక్‌లు, పన్ను అధికారులు, ఎజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బిఐ సూచన చేసిందన్నారు.