మనువాద ట్రోలింగ్‌ ముఠాల ఆటకట్టిస్తాం

– జర్నలిస్ట్‌ తులసిచందుకు అండగా నిలుస్తాం
– రౌండ్‌టేబుల్‌లో పలు సంఘాల హామీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వాస్తవాలను జీర్ణించుకోలేని మనువాద ట్రోలింగ్‌ ముఠాల ఆటకట్టించేందుకు ఎక్కడిదాకా వెళ్లేందుకైనా సిద్ధమనీ, ప్రభుత్వాలు ఆ ముఠాలపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయపార్టీలు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేశారు. దుర్మార్గమైన అసభ్య భాషతో మహిళలను కించపర్చడం, ప్రగతిశీల ఆలోచనలపై అసహనాన్ని వ్యక్తం చేయడం వ్యవస్థాగతంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే), ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (పీసీహెచ్‌), నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ మీడియా ఇండియా (ఎన్‌డబ్ల్యూఎమ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే), తెలంగాణ స్టేట్‌ స్మాల్‌ అండ్‌ మీడియం పేపర్స్‌ అండ్‌ మేగజైన్స్‌ అసోసియేషన్‌ సంయుక్తాధ్వర్యంలో మంగళవారం నాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ‘జర్నలిజం- ట్రోల్‌ముఠాలు’ అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. జర్నలిస్టు తులసిచందు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీనియర్‌ జర్నలిస్టులు డాక్టర్‌ కే రామచంద్రమూర్తి, పాశం యాదగిరి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌, వీక్షణం సంపాదకులు ఎన్‌ వేణుగోపాల్‌, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ పద్మజాషా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి ఆమర్‌, సామాజిక కార్యకర్త సజయ, సీనియర్‌ జర్నలిస్టు రాజకుమారి, కార్టూనిస్టు నర్సిం, డాక్టర్‌ మిత్ర, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, మహిళాట్రాన్స్‌జెండర్స్‌ జేఏసీ నేత దేవి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య సహా అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు, సివిల్‌సొసైటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజాల్ని పరిశోధించి, పరిశీలించి ప్రగతిశీల భావజాలంతో నిర్భయంగా అనేక అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్న తులసిచందుపై బీజేపీ మనువాద ట్రోలింగ్‌ ముఠాలు వ్యక్తిత్వాన్ని కించపర్చేలా సోషల్‌ మీడియాలో రాతలు రాస్తున్నాయనీ, అలాంటి చేష్టల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు.
జర్నలిస్టు తులసిచందుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గౌరీలంకేష్‌ సహా ప్రగతిశీలంగా ప్రశ్నించే మహిళల్నే ఈ ముఠాలు టార్గెట్‌ చేస్తున్నాయనీ, పెయిడ్‌ ట్రోలింగ్‌ ముఠాల ఏర్పాటును బీజేపీ ప్రారంభిస్తే, ఆ దాడిని ఎదుర్కొనేందుకు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నాయని వివరించారు. అందుకే ఇలాంటి చిల్లర రాతలపై ఎవరూ చర్యలు తీసుకోవట్లేదని విశ్లేషించారు.
పిరికితనంతో వ్యవహరించే ఇలాంటి ముఠాలు ఎక్కడా సొంతపేర్లు రాసుకోవనీ, తప్పుడు పేర్లు, చిరునామాలతో నిర్లజ్జ రాతలకు తెగబడుతున్నాయని ఈసడించారు. ప్రజా జర్నలిజం పెరుగుతున్నదన్నారు. కేంద్రప్రభుత్వం ‘మేం చెప్పిందే రైట్‌-మీరు చెప్పేది తప్పు’ అనే ధోరణిలో సోషల్‌మీడియా మార్గదర్శకాలను రూపొందించిందని వివరించారు. నిజాల్ని నిర్భయంగా చెప్తున్న గొంతులపై కత్తులు స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో ఉన్నామనీ, కానీ ప్రశ్నించే ఆ గొంతుల్ని తప్పక కాపాడుకోవాలని ఆకాంక్షించారు. దానికోసం తులసిచందు వంటి వారికి సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని తెలిపారు.