– గత ప్రభుత్వం అనేక హామీలను ఎగ్గొట్టింది
– ప్రజా పాలనలో గ్రామాల చెంతనే అధికారులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తామని, ప్రతి చివరి ఇంటి వరకు ప్రభుత్వ పథకాలు చేరే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. రాష్ట్రంలో నూతన ప్రజా పాలన ప్రారంభమైందని ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ నెల 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆమె కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం అనేక హామీలు గుప్పించి వాటిని ఎగ్గొట్టిందని విమర్శించారు. నిరుద్యోగభృతి, పోడు భూములకు హక్కుపత్రాలు, అసైన్డ్ భూములకు హక్కులు, రుణమాఫీతో పాటు కేంద్రం చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు అమలు చేయలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రజలంతా ఒకటేనని స్పష్టంచేశారు. ప్రభుత్వం గురువారం నుంచి ప్రజాపాలన పేరిట ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటుందని చెప్పారు. అధికారులే గ్రామాలకు వచ్చి ప్రజల నుంచి వీటిని స్వీకరిస్తారని, దరఖాస్తులు ముందుగానే పూరించి అధికారులకు అందజేస్తే బాగుంటుందని వివరించారు. ఎవరైనా తమ గ్రామానికి రాలేదని ఇబ్బందులు పడకూడదని, మండల కార్యాలయాల్లోనూ అందజేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే సమస్యలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివాసీల పోడు భూములకు హక్కుపత్రాలు అందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విలేకరులు ఉద్యమకారులే..!
విలేకరులు కూడా ఉద్యమకారులేనని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చేందు కు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని వివరించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమావేశం లో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్, ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.