చంద్రబాబుకు ఘనస్వాగతం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం

Welcome to Chandrababu Excitement in TDP ranks– మాజీ సీఎంను పరీక్షించిన ఏఐజీ డాక్టర్ల బృందం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన బాబు, బుధవారం తెల్లవారుఝామున ఉండవల్లి నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయానికి భారీగా ఆపార్టీ శ్రేణులు, అభిమానాలు, ఐటీ ఉద్యోగులు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. కోర్టు షరుతుల నేపథ్యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే కారులో నుంచి ప్రజలకు నమస్కరించి ముందుకుసాగారు. వందలాది అభిమానులు, కార్లు, బైక్‌లపై చంద్రబాబు కాన్వారును అనుసరిస్తూ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఏఐజీ డాక్టర్ల బృందం చంద్రబాబు నివాసానికి వెళ్లి అతనిని కలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు గురువారం ఉదయం పది గంటలకు చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనకు అవసరమైన వైద్యపరీక్షలు చేయనున్నారు. 52 రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్న ఆయన మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు, ఇతరాలు అయిన తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మరుసటి రోజు శుక్రవారం ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చంద్రబాబుకు వైద్యపరీక్షలు చేసే అవకాశముంది. రెండోరోజు కూడా బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని బాబుకు జేజేలు పలికారు. ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు.