నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలోకి వెళ్తుంటే రైస్‌మిల్లు వద్ద, ఊరు చివర చర్చి పక్కన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. గ్రామాలలో స్వచ్భభారత్ లక్ష్యం నెరవేరడం లేదు. చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో పోగుచేసిన చెత్తను ఆయా గ్రామాల సరిహద్దుల్లో కుప్పలుగా పోస్తుండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. సేకరించిన చెత్తతో సంపదను సష్టించి తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్న లక్ష్యం కూడా నీరుకారుతోంది.తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి తడి చెత్తను వర్మికంపోస్టు కుండీలలో కంపోస్టు ఎరువుగా మార్చి విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి డంపింగ్‌యార్డ్ లు ఏర్పాటు చేశారు.అయితే గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామశివారులో ఖాళీగా ప్రదేశాల్లో వేస్తున్నారు.దీంతో ప్రతి గ్రామంలో సరిహద్దుల వద్ద చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.గ్రామంలోకి ప్రవేశించే ముందే రోడ్లకు ఇరువైపులా చెత్తకుప్పలు దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చెత్తను రోడ్లపక్కనే వేస్తున్నారు.అప్పుడప్పుడు ఈ చెత్తకు నిప్పు పెడుతుండడంతో పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.