వామ్మో ధరలు..

 Whammo prices..– భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
– 2020 తర్వాత ఇప్పుడే అధికం
– ఆందోళనలో మోడీ ప్రభుత్వం
దేశంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగి జూలైలో 11.51%గా నమోదైంది. 2020 జనవరి తర్వాత ఆహార ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం చివరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే సంవత్సరంలో లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ ధరాఘాతాన్ని చూసి కలవరపాటుకు గురవుతోంది.
న్యూఢిల్లీ :మార్కెట్‌ అంచనాలను తలకిందులు చేస్తూ కూరగాయలు, పప్పులు, ఆహార ధాన్యాలు, పాలు-పాల ఉత్పత్తుల ధరలు బాగా పెరగడంతో గత పదిహేను నెలలలో తొలిసారిగా జులైలో వార్షిక రిటైల్‌ ద్రవ్యోల్బణం (వినియోగదారులు తమ వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసే వస్తువులు, సేవల ధరలకు సంబంధించిన రేటు) 7.44%నికి చేరింది. జూన్‌లో కేవలం 4.88%గానే ఉన్న ఈ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. వార్షిక రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 6.40%గా ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేయగా అది తప్పింది. 2022 ఏప్రిల్‌ తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణానికి ప్రధాన సూచికగా ఉండే వినియోగ ధరల సూచిక (సీపీఐ) జూలైలో అంచనాలకు తగిన విధంగానే ఉండగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరుగుతుందని ఊహించలేదని ఇండియా రేటింగ్స్‌ ఆర్థికవేత్త దేవేంద్ర పంత్‌ చెప్పారు. జూన్‌లో 4.49%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 11.51%కి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ ం 5.4%గా ఉండవచ్చునని రిజర్వ్‌బ్యాంక్‌ గత నెలలో అంచనా వేసింది. గతంలో 5.1%గా ఉన్న ద్రవ్యోల్బణం ఆహార ధరల పెరుగుదల కారణంగా 5.4%కి చేరవచ్చునని తెలిపింది. ఇక కూరగాయలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఏకంగా 37.34% పెరిగింది. అంతకుముందు జూన్‌ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 1% తగ్గడం గమనార్హం. వంటగదిలో గృహిణులు ఎక్కువగా వాడే టమాటాలు, ఉల్లిగడ్డలు, వంకాయలు, అల్లం, వెల్లుల్లి ధరలు గత కొన్ని నెలలలో రెట్టింపు అయ్యాయి. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరగడంతో రిజర్వ్‌బ్యాంక్‌ గత వారంలో రుణాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. బ్యాంకులలోని నగదు నిల్వలను తగ్గించే ందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ద్రవ్యో ల్బణం 4.9%-4.97% మధ్య ఉండవచ్చునని అంచనా వేశారు. ఇక ఆహార ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం జూన్‌లో 12.7% ఉండగా జూలై నాటికి 13.04%కి పెరిగింది. దీంతో ధరలను అదుపు చేసే క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోయే నెలల్లో గోధుమలను దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. ఐదు రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు జరగబోయే ఎన్నికలపై ధరల ప్రభావం తప్పనిసరిగా పడుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఇప్పుడు గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా ధరలకు కళ్లెం వేయాలని యోచిస్తోంది. బాసుమతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గోధుమలపై 40% దిగుమతి సుంకాలను రద్దు చేయాలని అనుకుంటోంది. ఆహార ద్రవ్యోల్బణంలో ఓ మాదిరి పెరుగుదల కన్పించినా అది ఓటర్లకు ఆగ్రహం తెప్పిస్తుందని ఆర్థికవేత్త ధీరజ్‌ నిమ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. ‘ద్రవ్యోల్బణం అనేది ప్రతి ఒక్కరి సమస్య. అది అందరి పైన ప్రభావం చూపుతుంది. కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వివరించారు.