ఎంత ఘాటు ప్రేమయో..!

What a fierce love..!– దోపిడీదారులకు స్వాగతం
– అవినీతిపరులకు అందలం
– బాండ్ల పథకమే అతి పెద్ద స్కామ్‌ అన్న మేధావులు విచారణలు, చర్యల ఊసే ఉండదు
– పారిపోతుంటే చూస్తుంటారు… స్వదేశానికి రప్పించరు
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో ఎక్కడ చూసినా అవినీతి విలయతాండవం చేస్తోంది. అవినీతి మరక అంటని స్వచ్ఛమైన పాలనను అందిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాషాయ ప్రభుత్వం అవినీతిపరులకు పెద్ద పీట వేస్తోంది. దేశ సంపదను విచ్చలవిడిగా దోచుకునేందుకు వారికి దారులు  చూపుతోంది. అవినీతి రహిత పార్టీగా ముద్ర వేయించుకునేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఇప్పటికే కుంభకోణాల ఊబిలో పూర్తిగా  కూరుకుపోయింది.యడ్యూరప్ప మొదలు బీజేపీ సీఎంలు అందరూ అవినీతి మరక అంటిన వారే.
న్యూఢిల్లీ : అవినీతిని అంతం చేస్తానని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. నల్లధనాన్ని వెలికితీస్తానని బీరాలు పలికింది. స్విస్‌ బ్యాంకులో కుబేరులు దాచుకున్న సొమ్మును బయటికి తీసుకొస్తానని, ఆ డబ్బును భారతీయులందరికీ పంచుతానని చెప్పింది. ప్రతి భారతీయుడి బ్యాంక్‌ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తానని ఆశ పెట్టింది. అయితే వీటిలో ఏ ఒక్క హామీనీ బీజేపీ నెరవేర్చలేకపోయింది.
’40శాతం ప్రభుత్వం’
బీజేపీ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాలలోనూ అవినీతి హద్దులు దాటింది. కర్నాటకలో ‘40% బీజేపీ ప్రభుత్వం’పై కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్ల సంఘం నేతలే స్వయంగా బీజేపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేశారు. తన మరణానికి ప్రభుత్వమే కారణమని లేఖ రాసి ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అవినీతి ఆరోపణల కారణంగా అప్రదిష్టపాలైన బీజేపీ శాసనసభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే.
బ్యాంకులకు టోకరా… విదేశాలకు పలాయనం
విజయ్ మాల్యా, నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ, మెహుల్‌ చోస్కీతో పాటు 46 మంది పెద్దలు బ్యాంకులను మోసం చేసి ప్రజాధనంతో విదేశాలకు పలాయనం చిత్తగించారు. వీరిలో ఏ ఒక్క సంపన్నుడు కూడా ఇప్పటి వరకూ విచారణను ఎదుర్కోలేదు. ఏ ఒక్కరినీ నేటి వరకూ అరెస్టు చేసి స్వదేశానికి తీసుకురాలేదు. స్విస్‌ బ్యాంక్‌లో డబ్బు దాచుకున్న బడా బాబుల విషయాన్ని అలా ఉంచితే ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన వారి జాబితాను ఎస్‌బీఐ బయటపెట్టకుండా చివరి వరకూ బీజేపీ ప్రయత్నించింది. అందుకోసం తన అధికారాన్ని ఉపయోగించింది.
నోట్ల రద్దుతో ఇక్కట్లు
పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. చిరువ్యాపారులు వీధులపా లయ్యారు. ఇంత చేసినా ఒక్క రూపాయి నల్లధనాన్ని కూడా ప్రభుత్వం వెలుగులోకి తేలేకపోయింది. కరెన్సీ నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరిన 170 మంది వృద్ధులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయారు.
వారిపై చర్యలేవి?
పలువురు భారతీయులు సహా అనేక మంది అంతర్జాతీయ నేరగాళ్ల జాబితాను పనామా పత్రాలు బహిర్గతం చేసినప్పటికీ ఒక్కరిపై కూడా చర్య తీసుకున్న పాపాన పోలేదు. రఫేల్‌, 2జీ, బొగ్గు, వ్యాపమ్‌, కృష్ణ-గోదావరి బేసిన్‌, బిట్‌కాయిన్‌ సహా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఏ ఒక్క దానిపైన చిత్తశుద్ధితో విచారణ జరిపించలేదు. ఎవరినీ బాధ్యులను చేయలేదు. ఈ ఉదంతాలన్నింటినీ గమనిస్తే భారీ స్తాయిలో అవినీతి రాకెట్‌ జరిగినట్లు అర్థమవుతుంది.
స్వయం ప్రకటిత చట్టంతో…
గో సంరక్షణ ముసుగులో మోడీ ప్రభుత్వం గొడ్డు మాంసం ఎగుమతులను ప్రోత్సహించింది. మాంసం ఎగుమతిదారుల నుండి ఎన్నికల బాండ్ల రూపంలో కమీషన్లు దుండుకుంది. ‘పీఎం కేర్స్‌’ నిధి ద్వారా కూడా మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా సొమ్ము పోగేసుకుంది. అయితే డబ్బు ఎవరు ఇచ్చారు, దానిని ఎలా వినియోగించారు అనే విషయాలను ప్రజలకు బహిర్గతం చేయలేదు. ఎన్నికల బాండ్లు, పీఎం కేర్స్‌ ఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం ఓ స్వయం ప్రకటిత చట్టాన్ని తీసుకొచ్చింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు జారీ చేసిన తర్వాత అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి.
అతి పెద్ద స్కామ్‌ అదే
వీటన్నింటి కంటే దారుణమైన కుంభకోణం ఎన్నికల బాండ్లు. వీటి ద్వారా బీజేపీ పెద్ద ఎత్తున అవినీతి సొమ్మును తన ఖాతాలో వేసుకుంది. 33 కంపెనీలు అందజేసిన విరాళాల ద్వారా మోడీ ప్రభుత్వానికి రూ.1,751 కోట్లు అందాయి. దీనికి ప్రతిఫలంగా మోడీ ప్రభుత్వం ఆయా కంపెనీలకు రూ.2.7 లక్షల కోట్ల విలువైన సర్కారు కాంట్రాక్టులు కట్టబెట్టింది. కాంట్రాక్టులు పొందిన 192 కంపెనీలు బీజేపీ ఖాతాల్లో రూ.551 కోట్ల కమిషన్‌ను జమ చేశాయి. ఈ విరాళాలు, కమిషన్లు అన్నీ ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చినవే. మరోవైపు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి విరాళాలు ముట్టజెప్పని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సీబీఐ, ఈడీతో దాడులు చేయించి విచారణ జరిపిస్తామని బెదిరించారు. వీటికి భయపడిపోయిన ఆ కంపెనీలు బాండ్ల రూపంలో బీజేపీకి రూ.2,471 కోట్లు సమర్పించుకున్నాయి. అంతే…విచారణల కథ కంచికి పోయింది.కోవిడ్‌ వ్యాక్సిన్‌, కోవిడ్‌ ట్యాబ్లెట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఔషధ కంపెనీలు వందల కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి బీజేపీ ఖాతాకు చేర్చాయి. అసలు ఎన్నికల బాండ్ల పథకమే అతి పెద్ద కుంభకోణమని మేధావులు వ్యాఖ్యానించారు.
ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, హెచ్‌పీసీఎల్‌ ఇంకా ప్రయివేటీకరించలేదు.
ఆ దిశలో వాటి ప్రయాణముంది. అనువాదంలో జరిగిన లోపానికి చింతిస్తున్నాం. – ఎడిటర్‌