పెండ్లై ఎన్నేండ్లయినా భర్తకు భార్యే అన్నీ చేసిపెడుతుంది. అతనికి చేసి పెట్టడమే తన బాధ్యతగా భావిస్తుంది. చాలా మంది మహిళలు ఇలాగే అనుకుంటారు. భర్తలకు ఏమీ చెప్పరు. భర్త మాటే శాసనంగా నడుచుకుంటారు. అది వారిని ఎంత బాధపెట్టే పనైనా ఎదురు మాట్లాడకుండా సంసారం నెట్టుకొస్తుంటారు. కనీసం భర్త నుండి ప్రేమను పొందాలనే ఆలోచన కూడా ఉండదు. బాధపడుతూ లోలోపలే కుమిలిపోతూ కూర్చుంటే ఎప్పుడో ఓ అప్పుడు ఇది పెద్ద సమస్యగా మారిపోతోంది. కలిసి బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటి ఓ సమస్యతో ఎన్నో ఏండ్ల నుండి సతమతవుతున్న సుమతి కథే ఈ వారం ఐద్వా ఆదాలత్…
సుమతికి సుమారు 58 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త సురేష్‌కు 62 ఏండ్లు. ఇద్దరూ చూడటానికి చక్కగా ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వాళ్ల పెండ్లి కూడా అయిపోయి పిల్లలున్నారు. సురేష్ తండ్రి చనిపోయి ఏడాది అవుతుంది. తల్లి వీరితోనే ఉంటుంది. సురేష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఆయన ఉద్యోగం చేసేటపుడు ఎప్పుడూ భార్యను తీసుకొని బటయకు వెళ్లేవాడు కాదు. అసలు కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కడికీ వెళ్ళడు. ఏదైనా పెండ్లి, ఫంక్షన్ ఉంటే సుమతి మాత్రమే వెళ్లేది. సురేష్ మాత్రం ‘ఫంక్షన్లకు వచ్చే అంత సమయం నా దగ్గర లేదు’ అనేవాడు. అయినా సుమతి ఎప్పుడూ నిరాశ చెందలేదు. ‘ఇక ఆయన రాడు, ఎక్కడికి వెళ్ళినా నేను మాత్రమే వెళ్లాలి’ అనేది ఆమె మనసులో ఫిక్స్ అయిపోయింది.
కానీ సురేష్ ఆఫీసు వాళ్ల ఫంక్షన్లకు, పార్టీలకు మాత్రం వెళతాడు. తండ్రి ఎలాగూ రాడు కనీసం పిల్లలైనా వస్తారా అంటే వాళ్లు కూడా తల్లితో వెళ్ళరు. ఉద్యోగంలో భర్త, చదువుల్లో పిల్లలు బిజీగా ఉన్నారని తనే అర్థం చేసుకొని సర్దుకుపోయేది. ఆమె వాళ్లను ఎంత అర్థం చేసుకుంటున్నా సుమతి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఏ ఒక్కరూ చూసుకోరు. పిల్లలు చదువులు అంటూ కాలేజీలకు వెళ్లిపోయేవారు. సురేష్ ఉద్యోగం అంటూ ఆఫీసుకు వెళ్లిపోతాడు. అత్తమామలు వృద్ధాప్యం వల్ల పట్టించుకునే అవకాశమే లేదు. ఇలా తన చుట్టూ ఇంత మంది ఉన్నా సుమతి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. కనీసం ఆమెకు గౌరవం, మర్యాద కూడా ఇవ్వరు. ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సురేష్ వాళ్ల అమ్మనాన్నలతోనే మాట్లాడేవాడు. భార్యకు అసలు ఏమీ చెప్పడు. చివరకు పిల్లల చదువులు, పెండ్లి గురించి కూడా ఆమెతో పంచుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కూతురు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటి గురించి కూడా సుమతిని మాట్లాడనివ్వలేదు. సురేష్ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆమెను కేవలం ఇంట్లో పని మనిషిగా తప్ప ఆయనకు చేసే ఏ కార్యం గురించి సుమతితో చర్చించలేదు. వాళ్లిద్దరి పెండ్లి జరిగి ఇప్పటికి 30 ఏండ్లు అవుతుంది. ఇన్నేండ్లవుతున్నా అది నా ఇల్లు, వాళ్లు నా వాళ్లు అనే భావన ఆమెలో రాలేదు. కేవలం వాళ్ల అవసరాలు తీర్చే యంత్రంగానే ఉంటుంది.
ఆమె ఏదైనా మాట్లాడేందుకు ప్రయత్నించినా ‘నూ ఎక్కువగా మాట్లాడకు, నీ బోడి సలహాలు ఏమీ అవసరం లేదు’ అంటారు. ఇంకా ఏదైనా అంటే ‘నీ పుట్టింటికి వెళ్లిపో’ అంటాడు. దాంతో ఆమె రోజురోజుకు మానసికంగా నలిగిపోయేది. సుమతి పుట్టింటి వాళ్లేమో ‘నీ ఇల్లు ఇది కాదు, నీ భర్త ఇల్లే నీ ఇల్లు’ అంటారు. దాంతో ఆమె పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. కొన్ని రోజుల కిందట సుమతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. అప్పుడు కూడా ఆమెను చూసుకోడానికి ఎవ్వరూ రాలేదు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, కుటుంబాలతో బిజీ. ఇన్నేండ్లలో భర్త నాతోనే ఉంటే బాగుండని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. కనీసం ఆరోగ్యం బాగోనప్పుడైనా భర్త తన దగ్గర ఉంటే బాగుండనుకుంది. అయినా సురేష్ ఆమెను పట్టించుకోలేదు. తనే ఆస్పత్రికి వెళ్లి చూయించుకొని వచ్చింది.
మొన్నటి వరకంటే భర్త ఉద్యోగంలో బిజీ ఉన్నాడు. కానీ ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా భర్త తనను పట్టించుకోకపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అది భరించలేక ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. ‘నేను మనిషిని కాదా, నాకూ కొన్ని కోరికలుంటాయి కదా? ఇవేవీ మా ఇంట్లో వాళ్లకు పట్టవు. వాళ్ల అవసరాలు తీరిపోతే చాలు. పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్లు చూసుకుంటున్నారు. కనీసం నా భర్త అయినా నా గురించి పట్టించుకోవాలి కదా? నన్ను కేవలం ఓ యంత్రంలా చూస్తున్నారు. ఈ వయసులో నాకు కావల్సింది కాస్త విశ్రాంతి, గౌరవం. అవి కూడా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఇక నేను ఆయనతో ఉండలేను. నాకు ఆయనతో విడాకులు ఇప్పించండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మేము సురేష్‌ను పిలిచి విషయం మొత్తం చెబితే ‘అసలు ఆమెకు ఏం కావాలో అర్థం కావడం లేదు. సుమతి ఆస్పత్రిలో ఉంటే అక్కడి వాళ్లతో మాట్లాడి ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాను. ఆమెను చూసుకున్నందుకు అదనంగా డబ్బు కూడా ఇచ్చాను. ఆమెకు ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాను. డబ్బు విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. పిల్లల పెండ్లి విషయంలో అంటే వారికి నచ్చిన జీవిత భాగస్వాములను వారే చూసుకున్నారు. అందుకే అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అమ్మానాన్న పెద్దవారు కాబట్టి వారి సలహాలు అవసరం అనిపించి వాళ్లతో మాట్లాడేవాడిని. దాన్ని కూడా తప్పుబడితే నేనేం చేయలేను. సుమతి ఏమైనా చిన్న పిల్లనా, ఈ వయసులో బయటకు వెళదామంటుంది. ఆమెతో కొంత సమయం గడపాలంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ వయసులో ఇవేం అలోచనలు’ అన్నాడు.
దానికి మేము ‘ఆమె కోరుకున్న దాంట్లో తప్పేముంది. భార్యా, భర్తలు కలిసి బయటకు వెళితే తప్పేముంది. రిటైర్ అయిన తర్వాత భార్యా భర్తలు చాలా మంది విహార యాత్రలకు వెళుతున్నారు. బయటకు వెళ్లడానికీ, వయసుకూ సంబంధం లేదు. ఏ వయసులో అయినా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరితో ఒకరి కొంత సమయం గడపాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లలు వారి సంసారాలు వాళ్లు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒకరికోసం ఒకరు బతకాల్సిన సమయం ఇది. ఇలాంటప్పుడు ఒకరి తోడు ఒకరికి చాలా అవసరం. ఇదే మీ ఇద్దరికీ మంచిది. మీకోసం ఆమె ఇప్పటి వరకు అన్నీ చేసి పెట్టింది. అలాంటి ఆమెకు మీరు కనీసం గౌరవం, మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఆమే మనిషే కదా? ఈ వయసులో విడిపోవాలనే ఆలోచన వచ్చింది ఆమెకు. అంటే తన మనసు ఎంత బాధపడిందో అర్థం చేసుకోండి. లేదంటే ఈ వయసులో ఏ తోడూ లేకుండా ఒంటరిగా బతకాల్సి వస్తుంది’ అన్నాము.
దాంతో అతను ఆలోచనలో పడ్డాడు. ‘మీరు చెప్పింది కూడా నిజమే. ఏదో తన పని తాను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను అనుకున్నాను తప్ప తన గురించి పట్టించుకోలేదు. ఇన్ని రోజులు నా ప్రవర్తన వల్ల సుమతి ఎంత బాధపడిందో నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పటి నుండి కచ్చితంగా సుమతితో ప్రేమగా ఉంటారు. ఇద్దరం కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటాం, సరదాగా గడుపుతాం’ అని చెప్పి సంతోషంగా భార్యను తీసుకొని వెళ్లిపోయాడు.
– వై వరలక్ష్మి, 9948794051